logo

అటవీశాఖలో ఆణిముత్యం

అటవీ శాఖలో ఉద్యోగం చేయాలనేది తన ఆకాంక్ష. ఇష్టంతో చదివి ఆ కొలువు చేపట్టారామె. అటవీ భూముల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల శిక్షణలో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాల్లో ప్రథమంగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు ఖమ్మం రేంజి కొణిజర్ల మండలం మేకలకుంట బీట్‌ ఆఫీసర్‌ కె.అనూష.

Updated : 03 Oct 2022 03:29 IST

బీట్‌ ఆఫీసర్ల శిక్షణలో రాష్ట్రస్థాయి ఘనత
ఖమ్మం గాంధీచౌక్‌, న్యూస్‌టుడే


కె.అనూష

అటవీ శాఖలో ఉద్యోగం చేయాలనేది తన ఆకాంక్ష. ఇష్టంతో చదివి ఆ కొలువు చేపట్టారామె. అటవీ భూముల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల శిక్షణలో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాల్లో ప్రథమంగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు ఖమ్మం రేంజి కొణిజర్ల మండలం మేకలకుంట బీట్‌ ఆఫీసర్‌ కె.అనూష.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి...
సొంతూరు ఖమ్మం జిల్లాలోని మధిర. తండ్రి వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తారు. భర్త తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన శివకృష్ణ వ్యాపారం చేస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన అనూష ఇంటర్మీడియట్‌, బీటెక్‌(ఈసీఈ) కూడా ఖమ్మంలోనే పూర్తి చేశారు. అనంతరం గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. తొలుత పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చినా చేరలేదు. తర్వాత 2017లో అటవీ శాఖ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2019లో మేకలకుంట బీట్‌ ఆఫీసర్‌ పోస్టింగ్‌ దక్కించుకున్న ఆమె తన పరిధిలో ఉన్న 750 హెక్టార్ల అటవీ భూమిని సంరక్షిస్తున్నారు.

నాలుగు అంశాల్లోనూ బంగారు పతకాలు
గత ఏప్రిల్‌ నుంచి ఆరు నెలలపాటు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దూలపల్లిలోని అటవీ శాఖ కళాశాలలో బీట్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఇది గత నెల 30న పూర్తయింది (అటవీ శాఖలో కొలువులో చేరాక శిక్షణ ఇస్తారు). శిక్షణలో నాలుగు అంశాల్లో నాలుగు బంగారు పతకాల్ని అనూష సాధించారు. బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌, బ్యాచ్‌ టాపర్‌, ఫారెస్ట్‌ ప్రొటక్షన్‌, ఫారెస్ట్‌ రీజనరేషన్‌ అంశాల్లో పతకాలు లభించాయి. అటవీ బీట్‌ అధికారుల స్నాతకోత్సవంలో రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్‌ రాజారావు చేతుల మీదుగా అవార్డులందుకున్నారు. మొత్తం 55 మంది బ్యాచ్‌లో 14 మంది మహిళా బీట్‌ ఆఫీసర్లున్నారు. వారందరిలో తాను టాపర్‌.

‘‘అటవీ శాఖలో పోడు భూముల సమస్య ప్రధానం. ప్రజలకు అవగాహన కల్పించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడమే కీలకం. అటవీ శాఖకు చెందిన అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చూడటమే నా లక్ష్యం’’

- అనూష.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని