logo

బదిలీల్లో వింత పోకడలు

ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల్లో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 05 Feb 2023 02:02 IST

కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపణలు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల్లో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2015, 2018 బదిలీల్లో స్పౌజ్‌, ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో ఉపయోగించుకుని బదిలీ పొందిన వారు, నిబంధనల ప్రకారం 5, 8 ఏళ్లు పూర్తి కాకుండానే మళ్లీ వారి స్పౌజ్‌లు, స్పౌజ్‌ పాయింట్లతో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. సేవా గ్రంథాల్లో నమోదు కాలేదనే కారణంతో కొద్దిమంది ఇలా చేస్తున్నట్లు సమాచారం. పాయింట్ల కోసం హెచ్‌ఆర్‌ఏ కేటగిరీల్లోనూ కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

క్షుణ్ణంగా పరిశీలిస్తేనే.. విద్యాశాఖ అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అర్హులైన ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశముంది. తప్పులు సవరించకుండా బదిలీ దరఖాస్తులపై సంతకం చేస్తే సంబంధిత కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, హైస్కూల్‌ హెచ్‌ఎంలు, ఎంఈవోలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మెరిట్‌ జాబితాలో తప్పులు.. మెరిట్‌ ప్రకారం తయారుచేయాల్సిన ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలోనూ తప్పులు జరుగుతున్నాయని, పదేపదే అప్పీల్స్‌ చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం శిక్షణ లేకుండా నియమితులైన వారి సీనియారిటీ, శిక్షణ పూర్తయి ఆఖరి పరీక్ష రాసిన తర్వాత రోజు నుంచి లెక్కించాలి, కానీ దానికి భిన్నంగా ప్రథమ నియామకం తేదీ నుంచి లెక్కించడం వల్ల ఉద్యోగోన్నతులకు అర్హులకు నష్టం జరుగుతోందని చెబుతున్నారు.

బేసిక్‌ సీనియారిటీ పట్టించుకోని వైనం.. ఆర్‌జేడీ విడుదల చేసిన మల్టీ జోన్‌-1 హెచ్‌ఎంల ఉద్యోగోన్నతుల జాబితా తప్పులతడకగా ఉందనిఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జిల్లా బేసిక్‌ సీనియారిటీ దెబ్బతినకుండా ఇంటర్‌-పే.(అన్ని జిల్లాల్లో అన్ని క్యాడర్లలో) సీనియారిటీ రూపొందించాల్సిన అధికారులు దీని గురించి పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి.


* జాబితాలను సవరిస్తున్నాం. వాటిని అత్యంత పారదర్శకంగా తయారు చేస్తున్నాం. కలెక్టర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే వాటిని ఆర్‌జేడీకి పంపిస్తాం. ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇ.సోమశేఖరశ్మ, డీఈవో, ఖమ్మం


* ఉద్యోగోన్నతుల, బదిలీల సీనియారిటీ జాబితాలను నిబంధనలు, విద్యాశాఖ రూల్స్‌ ప్రకారం తయారు చేసి ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చూడాలి. ఉపాధ్యాయుల అప్పీళ్లను సమగ్రంగా పరిశీలించి జాబితా విడుదల చేయాలి.

పారుపల్లి నాగేశ్వరరావు, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి


* 19 జిల్లాలతో కూడిన మల్టీజోన్‌-1 ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, సీనియారిటీ జాబితా తప్పుల తడకగా ఉంది. అప్పీల్స్‌ ఇచ్చినా పరిష్కారం కాలేదు. సీనియారిటీలో వెనక ఉండాల్సిన ఉపాధ్యాయులు చాలామంది ముందున్నారు.

మోరంపూడి నర్సింహారావు, ఎస్‌ఏ(గణితం), జడ్పీఎస్‌ఎస్‌ చింతగూడెం, పెనుబల్లి మండలం


* స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్‌జీటీల బదిలీల ఉద్యోగోన్నతుల జాబితాలు సమగ్రంగా తయారు చేయాలి. హడావుడిగా తయారు చేయటం వల్ల తప్పులు దొర్లే ప్రమాదం ఉంది. సమగ్ర బేసిక్‌ సీనియారిటీ జాబితాలు తయారు చేయాలి.

జె.కోటయ్య, ఎస్‌జీటీ, గోవిందాపురం, బోనకల్లు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని