logo

వేడెక్కిన వైరా

వైరా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారిన ఈ నియోజకవర్గ పరిణామాలు ఈసారీ అదే స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 06 Feb 2023 05:48 IST

పొంగులేటి వెంట నియోజకవర్గ భారాస ప్రజాప్రతినిధులు

పొంగులేటి క్యాంప్‌ కార్యాలయంలో శ్రీనివాసరెడ్డితో విజయాబాయి, మద్దతుదారులు

వైరా, న్యూస్‌టుడే: వైరా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారిన ఈ నియోజకవర్గ పరిణామాలు ఈసారీ అదే స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎక్కువ మొత్తంలో అనుచర గణం ఉన్న ప్రాంతంగా వైరాకు గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన రాములునాయక్‌ వెనక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బొర్రా రాజశేఖర్‌ అంతా తామై వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో గడిచిన నాలుగైదేళ్లేలో పొంగులేటికి, ఎమ్మెల్యే రాములునాయక్‌ మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. భారాస అసమ్మతి నాయకుడిగా ఉన్న పొంగులేటి వేరు కుంపటి పెడుతున్న నేపథ్యంలో గత సార్వత్రిక సమయంలో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ నుంచి బరిలో నిలిచిన బాణోత్‌ విజయాబాయి ఊహించని విధంగా ఆయన వర్గానికి చేరుకున్నారు. పొంగులేటి వర్గంగా వైరా నుంచి బరిలో నిలవనున్నట్లు ప్రకటన చేశారు. ఇంకోపక్క నియోజకవర్గంలోని పలువురు భారాస ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, సాయంత్రానికి పార్టీ మండల నాయకత్వం వారిపై బహిష్కరణ వేటు వేస్తున్నట్టు ప్రకటనలు చేయటం చకచకా జరిగిపోయాయి. కొత్త రాజకీయ కోణం నేపథ్యంలో మరో ముఖ్యమైన అంశంగా వైరా మున్సిపాలిటీ అవిశ్వాసం తెరపైకి వస్తోంది.


వేటు వీరిపైనే..

వైరా తాజా పరిణామాలపై భారాస జిల్లా నాయకత్వం సమాలోచనలు మొదలుపెట్టింది. ఆదివారం వైరాలో పర్యటించిన ఎంపీ నామా ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్‌తో క్యాంపు కార్యాలయంలో ఏకాంతంగా చర్చించారు. పొంగులేటి కార్యక్రమానికి హాజరైన భారాస ప్రజాప్రతినిధులు, నాయకులను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్యే రాములునాయక్‌ సూచనలతో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు వారి మండలాల్లో సస్పెండ్‌ చేసిన వారి జాబితాను విడుదల చేశారు. వైరా నుంచి మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు, మున్సిపల్‌ ఛైర్మన్‌, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సహా అష్ణగుర్తి సర్పంచి ఇటుకల మురళి.. కొణిజర్ల నుంచి ఎంపీపీ, ఆత్మ ఛైర్మన్‌తోపాటు పెద్దమునగాల సర్పంచి పరికపల్లి శ్రీను, రాయల పుల్లయ్య, మోషే, రావు, బండారు శ్రీను, గుండ్ల కోటేశ్వరరావు, జూలూరుపాడు ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్‌, దీరావత్‌ రాంబాబు, ఏఎంసీ డైరెక్టర్‌ జగన్నాథం, హత్తిరామ్‌, కారేపల్లి నుంచి కోఆప్షన్‌ సభ్యుడు హనీఫు, కారేపల్లి, మాదారం సర్పంచులు ఆదెర్ల స్రవంతి, ఆజ్మీరా నరేశ్‌,  ఇమ్మడి తిరుపతిరావు, ఆలయ ఛైర్మన్‌ మల్లెల నాగేశ్వరరావు, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మజీద్‌పాషాలున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమావేశానికి పార్టీ అనుమతి లేకుండా హాజరైనందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.


ఎవరు ఎవరి వైపు?

నియోజకవర్గంలో ఇన్నాళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని మోసంచేసి వెళ్తే సహించేది లేదని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. ఏ ఒక్కరినీ వదలమని, పదవుల్లో కొనసాగించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ‘స్థానిక’ పదవుల్లో వైరా పురపాలక ఛైర్మన్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. పురపాలక ఛైర్మన్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు భారాస మార్గాలను అన్వేషిస్తుంది. కొత్త పురపాలక చట్టం (నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవటం) పట్టాలెక్కని నేపథ్యంలో పాత చట్టాన్ని వినియోగించాలని భావిస్తోంది. కానీ కౌన్సిలర్లు ఎంతమంది ఎవరికి మద్దతు పలుకుతారు? ఎవరు ఏ వర్గం? అనే అంశంపై స్పష్టత వస్తేనే అవిశ్వాస తీర్మానం అంశం కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కౌన్సిలర్లు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వారంలో వైరాలో జరిగే నియోజకవర్గ ఆత్మీయ సమావేశం మరిన్ని పరిణామాలకు వేదికగా మారుతుందని పొంగులేటి వర్గీయులంటుండగా కొత్తగా పోయేవారెవరూ లేరని భారాస నాయకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని