logo

సమష్టి కృషితోనే పల్లెల అభివృద్ధి: కలెక్టర్‌

అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషిచేస్తే అద్భుత ఫలితాలు సాధించొచ్చని, జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు.

Published : 26 Mar 2023 03:39 IST

పురస్కార పోటీల్లో రాష్ట్రస్థాయికి అర్హత సాధించిన పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులతో కలెక్టర్‌ అనుదీప్‌, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, డీపీఓ రమాకాంత్‌, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు


కొత్తగూడెం కలెక్టరేట్, కొత్తగూడెం గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషిచేస్తే అద్భుత ఫలితాలు సాధించొచ్చని, జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. ‘జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కార’ పోటీలకు 17 పంచాయతీలు రాష్ట్రస్థాయి నామినేషన్‌కు అర్హత సాధించడం అభినందనీయమన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులను శనివారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ పురస్కారాల పోటీల్లో భాగంగా 27 కేటగిరీల్లో ముందంజలో నిలిచిన పంచాయతీలు రాష్ట్రస్థాయి పరిశీలనకు నామినేట్‌ కావడం జిల్లాకు దక్కిన మరో గౌరవం అన్నారు. మిగతావారు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పల్లెలు పరిశుభ్రంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు చేస్తున్న చర్యలు అభినందనీయమన్నారు. ఇప్పుడు అన్నిచోట్ల డంపింగ్‌ యార్డ్‌లు, ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణాలు, వాటర్‌ ట్యాంకర్లు, నర్సరీలను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ‘హరితహారం’ మొక్కలతో పల్లెలు కళకళలాడుతున్నాయన్నారు. సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషిచేస్తోందని, ఎంత అభివృద్ధి సాధించామన్నది స్థానిక పాలకవర్గాల చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, డీపీఓ రమాకాంత్‌, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.
ఎంపికైన పంచాయతీలివే.. సుజాతనగర్‌, మోరంపల్లిబంజర (బూర్గంపాడు), గౌతంపూర్‌ (చుంచుపల్లి),  కాకర్ల (జూలూరుపాడు), బోడు (టేకులపల్లి), ఉప్పుసాక (బూర్గంపాడు), తొట్టిపంపు(దమ్మపేట), అక్కినపల్లి (దమ్మపేట), అంబేడ్కర్‌నగర్‌ (చుంచుపల్లి), చల్ల సముద్రం (ఇల్లెందు), అశ్వారావుపేట, భద్రాచలం, వేపలగడ్డ (బూర్గంపాడు), చింతోనిచెలక (టేకులపల్లి), జమేదార్‌ బంజర్‌ (దమ్మపేట), చింతగుప్ప (దుమ్ముగూడెం), కోయగూడెం (బూర్గంపాడు).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని