logo

అటు సాధన.. ఇటు శోధన

రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు.

Published : 29 Mar 2024 02:20 IST

‘ఈనాడు’ కథనాల సహకారంతో ఎట్టకేలకు ఫలించిన మహిళల పోరాటం

ఈనాడు ప్రచురించిన వరుస కథనాలు

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. ఈ క్రమంలో తమ ఖాతాల్లో సాగిన రూ.కోట్ల లావాదేవీలను చూసి ముక్కున వేలేసుకున్నారు. అక్రమ లావాదేవీల్లో నిందితులెవరో గుర్తించాలంటూ పెద్ద పోరాటమే చేశారు. కేసు నమోదు చేయమని కాలికి బలపం కట్టుకుని తిరిగారు. వీరి ప్రయత్నాలకు ‘ఈనాడు’ కథనాలు తోడయ్యాయి. బ్యాంకు అధికారుల నిర్లిప్తత, పోలీసుల దాటవేత ధోరణిపై ఎప్పటికప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు 40 రోజుల అనంతరం వాస్తవాలు వెలుగుచూడటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?: ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌కు చెందిన ఆఫ్రిన్‌, సల్మా, నాజియా, సంధ్య, సౌజన్య వద్దకు చైతన్య అనే యువకుడి సాయంతో గతేడాది డిసెంబరులో ఖమ్మం నుంచి కొందరు వ్యక్తులు వచ్చారు. రూ.15వేల చొప్పున రుణమిస్తామని నమ్మబలికారు. మహిళలు బ్యాంకు ఖాతాలకు కావాల్సిన పత్రాలు ఇచ్చారు. సంతకాలు చేశారు. రుణం ఇప్పించేందుకు వచ్చిన వారు తమ పేరిట ఒక్కటే బ్యాంకు ఖాతా తెరిచారని భావిస్తూ ఉండగా వీరి వద్దకు మరో బ్యాంకు అధికారులు ఫిబ్రవరి 20న విచారణ పేరిట వచ్చారు. ఈనేపథ్యంలో ఖమ్మంలో తమ పేరిట రెండో ఖాతా ఉందని తెలుసుకుని మహిళలు కంగుతిన్నారు. రోజులపాటు శ్రమించి, ఆ ఖాతాల్లో రూ.కోట్లలో లావాదేవీలు సాగినట్టు గుర్తించి విస్మయం చెందారు. ఈ వ్యవహారాలన్నింటిపై ఫిబ్రవరి 22 నుంచి ‘ఈనాడు’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అనుమానాస్పద లావాదేవీలపై తెలంగాణ, గుజరాత్‌, హరియాణ తదితర రాష్ట్రాల సైబర్‌ విభాగం అధికారులు నాలుగుసార్లు హెచ్చరించిన విషయాలనూ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన  కలెక్టర్‌, ఎస్పీ రహస్య ఖాతాల నిగ్గుతేల్చాలంటూ జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాంరెడ్డిని ఆదేశించారు. మరోవైపు ఇల్లెందు పోలీసులతోపాటు కొత్తగూడెం  సీసీఎస్‌, స్పెషల్‌ బ్రాంచి పోలీసులు పలుమార్లు విచారించి కేసును కొలిక్కి తెచ్చారు. వివరాలను ఎస్పీ  రోహిత్‌రాజు వెల్లడించారు.

‘‘ఇల్లెందు, ఖమ్మం పోలీసులు తొలుత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించలేదు. కేసు నమోదు కోసమే పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ఈనాడు’లో వరుస కథనాలు రావటంతో ఎట్టకేలకు ఇల్లెందులో మార్చి 2న కేసు నమోదు చేశారు. ఆ తర్వాతే నిజాలు వెలుగుచూస్తాయన్న ఆశ కలిగింది.’’

యూనస్‌, సల్మా భర్త

‘‘హరియాణా, దుబయ్‌ నుంచి మా ఖాతాల్లో రూ.కోట్లలో లావాదేవీలు సాగాయని తెలిసి ఎప్పుడు ఏం జరుగుతుందో అని కంగారుపడ్డాం. కేసు నమోదు తర్వాత పోలీసులు వేగంగా చేసిన విచారణతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రంజాన్‌ మాసంలో నిజాలు   బయటపడటం సంతోషకరం.’’

ఆఫ్రిన్‌, బాధిత మహిళ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని