logo

ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం

 రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సహా జిల్లా పరిషత్‌లకు సూచనలందాయి.

Updated : 23 Apr 2024 05:32 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే :  రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సహా జిల్లా పరిషత్‌లకు సూచనలందాయి. 2019 మే మాసంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జులై 4న, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జులై 5న ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం    భావిస్తోంది. గత ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా కొన్ని మండలాలు ఏర్పాటయ్యాయి. ఆయా మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయాల్సి ఉంటుంది. మే 25 నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.

జూన్‌ 30 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ

  •  బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు కావాల్సిన పింక్‌, తెలుపు రంగు పేపర్‌ వివరాలు సిద్ధం చేసి ఆయా జడ్పీలు పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు మే 5 వరకు ప్రతిపాదనలు పంపించాలి.
  •  ఎన్నికల మార్గదర్శకాలకు సంబంధించి హ్యాండ్‌ బుక్స్‌, శిక్షణ కార్యక్రమాలకు సరిపడా పత్రాలు, పుస్తకాలను మే 31 నాటికి ముద్రించాలి.
  •  ఓటేసిన వారి చేతి వేలికి గుర్తుగా రాసే సిరా (ఇండెబుల్‌ ఇంక్‌)ను జూన్‌ 30 నాటికి సిద్ధం చేసుకోవాలి.
  •  ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓబీసీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను జూన్‌ 30 నాటికి ప్రభుత్వం పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ సూచించారు. అంతకుముందు ఆయా జడ్పీలు ముందస్తు ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది.

20 శాతం అదనంగా ముద్రణ

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రెండో సాధారణ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. సరిపడా బ్యాలెట్‌ పెట్టెలు, పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్స్‌ సమకూర్చుకోవాలని జడ్పీ సీఈఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖ రాశారు. అన్ని జడ్పీలకు కలిపి పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్స్‌ 1.80 లక్షల చొప్పున అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిని చంచల్‌గూడలోని ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి కొనాలని సూచించింది. జిల్లాల వారీగా మే 15 నాటికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. 2019 ఎన్నికల ప్రకారం ఖమ్మం జడ్పీ పరిధిలోని 20 మండలాల్లో 1,816 పోలింగ్‌ కేంద్రాలకు పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్స్‌ 8,800 చొప్పున, భద్రాద్రి జడ్పీ పరిధిలోని 21 మండలాల్లో 1,338 పోలింగ్‌ కేంద్రాలకు పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్స్‌ 6,500 చొప్పున అవసరమని తెలిపింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నాలుగు చొప్పున పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్స్‌ అవసరమవుతాయి. మొత్తమ్మీద 20 శాతం అదనంగా ముద్రించుకోవాలి. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న బ్యాలెట్‌ పెట్టెల వివరాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల సమయం కంటే ముందుగానే జిల్లాల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పెట్టెలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే అంశాన్ని    రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని