logo

కొత్త పుస్తకాలు కొనండి పోటీ పడతాం!

ఓ మంచి పుస్తకం పదిమంది మిత్రులతో సమానం. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. చరవాణులకు అలవాటుపడిన నేటి పిల్లల్లో అది కొరవడింది. వారిలో పుస్తక పఠనం పెంచాలని గ్రంథాలయాల్లో వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నారు. 

Updated : 19 May 2022 06:29 IST

 గ్రంథాలయాల బాట పట్టిన యువతరం


కర్నూలు కేంద్ర గ్రంథాలయంలో..

* ఓ మంచి పుస్తకం పదిమంది మిత్రులతో సమానం. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. చరవాణులకు అలవాటుపడిన నేటి పిల్లల్లో అది కొరవడింది. వారిలో పుస్తక పఠనం పెంచాలని గ్రంథాలయాల్లో వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నారు. 
* కళాశాలలు ముగిశాయి.. పోటీ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. అతి త్వరలో ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ‘పోటీ’ పడాలన్న ఉత్సాహంతో యువతరం గ్రంథాలయ బాట పడుతోంది. మౌలిక వసతులు లేకపోవడం... పుస్తకాలు పాతవి కావడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్తవి అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.- న్యూస్‌టుడే బృందం


చదువుకుంటున్న యువకుడు 

మధ్యాహ్న భోజనం ఎప్పుడో
* కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయ సంస్థకు నిత్యం 500 నుంచి 1000 మందికిపైగా పాఠకులు వస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక హాలు సిద్ధం చేశారు. గ్రూప్స్, ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ రంగంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఏఏ పుస్తకాలు అవసరమో.. వాటిని అందుబాటులో ఉంచారు. నిరుద్యోగ యువత    కొలువులు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. 
* కర్నూలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలనుంచే కాక తెలంగాణ రాష్ట్రం గద్వాల, వనపర్తి జిల్లా వాసులు వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మధ్యాహ్న సమయంలో భోజన వసతి కల్పించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కర్నూలు కార్పొరేషన్‌

పాత వాటితో పాట్లు 
ఎమ్మిగనూరు పట్టణంలోని టౌన్‌ బ్యాంకు ఎదురుగా కొత్త భవనం నిర్మించారు.   కేవలం ఐదు వేల వరకు పోటీ పరీక్షలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ పాతవి కావడంతో యువతరం ఇబ్బంది పడుతోంది.  డీఎస్సీ, గ్రూప్స్, టెట్, జనరల్, మార్కెటింగ్‌ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి తాజా సబ్జెక్టులు, సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.- న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

ఆర్థిక మంత్రి ఇలాకాలో
డోన్‌ పట్టణంలో పదేళ్ల నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. పలు రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన  పుస్తకాలు 3,145 వరకు అందుబాటులో ఉన్నాయి. నాలుగు గదులు ఉండగా ఒకదాంట్లో రీడింగ్‌ రూమ్, మిగిలిన మూడింటి¨లో పుస్తకాలు నిల్వ చేస్తున్నారు. మరుగుదొడ్ల పక్కనే ర్యాకులు ఏర్పాటు చేసి పుస్తకాలు ఉంచారు. ఆర్థిక మంత్రి దృష్టి సారించి సౌకర్యాలు కల్పించాలని పాఠకులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, డోన్‌ పురపాలిక

శిథిల భవనం
ఆదోని పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన( బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, గ్రూప్సు) పుస్తకాలు పదివేల వరకు అందుబాటులో ఉన్నాయి. నిత్యం 150 నుంచి 200 మంది వరకు పాఠకులు వస్తుంటారు. భవనం శిథిలావస్థకు చేరడం.. మరుగుదొడ్ల లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల తనిఖీ కోసం వచ్చిన గ్రంథాలయ జిల్లా ఛైర్మన్‌ సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ రూ.1.50 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తామన్నారు. 
- న్యూస్‌టుడే, ఆదోని సాంస్కృతికం

సెస్సు చెల్లిస్తే సులువే 
ఉమ్మడి జిల్లాలో సెస్సు బకాయిలు రూ.12.50 కోట్ల  వరకు వసూలు కావాల్సి ఉంది. ఇంటి పన్ను వసూలులో 8 శాతం గ్రంథాలయ సెస్సు వసూలు అవుతున్నా ఆ సొమ్మును నగరపాలక సంస్థతోపాటు పంచాయతీలు, పురపాలకాలు జమ చేయకపోవడంతో బకాయిలు రూ.కోట్లల్లో చేరుతోంది.

ఉమ్మడి జిల్లాల్లో శాఖలు: 59
పుస్తక నిక్షిప్త కేంద్రాలు: 48
ఉన్న పుస్తకాలు: 6,02,512
సభ్యులు: 52 వేలు
పాఠకుల సంఖ్య: 12,51,000  

సమయాన్ని పొడిగించాలి
- పురుషోత్తం, బీఎస్సీ, ఎమ్మిగనూరు 
గ్రూప్స్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన నూతన పుస్తకాల కొరత ఉంది. ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయాలి. గ్రంథాలయ సమయాన్ని పొడిగించాలి. కనీసం నాలుగు గంటలైనా చదువుకొనేందుకు వీలు కల్పించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పాఠ్య సామగ్రి అందుబాటులో ఉంచాలి.
మౌలిక వసతులు కల్పించాలి
- రవి, కొండపేట
నేను బీటెక్‌ పూర్తి చేసి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సన్నద్ధం అవుతున్నా. నిత్యం సాయంత్రం 4 గంటలకు గ్రంథాలయానికి వచ్చి 7 వరకు చదువుకుంటున్నా. ఒకేఒక్క మరుగుదొడ్డి, మూత్రశాల, ఇరుకుగదులతో అవస్థలు తప్పడంలేదు.  
ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యం
- నాగరాజు నాయక్, జొన్నగిరి
 నేను 2018లో ఎమ్మెస్సీ పూర్తి చేశా. ఇక్కడే చదువుకుని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో మొదటి దశ పరీక్షలో ఎంపికై రెండో దశ పరీక్షకు అర్హత సాధించా. జూన్‌ 12వ తేదీన రెండో దశ పరీక్ష ఉంది. దీని కోసం కర్నూలులో గదిని అద్దెకు తీసుకుని చదువుకుంటున్నా. మంచి పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని