logo

ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్‌ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

Published : 28 Mar 2024 03:29 IST

తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించారు
బీసీ నాయకుడినని కక్ష సాధిస్తున్నారు
బాధితుడు కె.వి.కుమార్‌ ఆరోపణ

తన భూమికి సంబంధించిన పత్రాలు చూపుతున్న బాధితుడు కె.వి.కుమార్‌

ఈనాడు, కర్నూలు: పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్‌ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తెదేపాకు చెందిన బీసీ నేతనైన తనను రాజకీయంగా కక్ష సాధించడం కోసమే అడ్డగోలుగా తన ఆస్తిని రాయించేసుకున్నారని బాధితుడు ఆరోపించారు. ఆ స్థలాన్ని కబ్జా చేయడం కోసం తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించారని.. దీనిపై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బుధవారం మీడియా సమావేశంలో వారు వాపోయారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి మేనల్లుడైన కె.వి.కుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు పంచాయతీ పరిధిలోని ఎమ్మిగనూరు ప్రధాన రహదారికి పక్కనున్న సర్వే నంబరు 93/2లోని 40 సెంట్ల భూమిని కె.వి.కుమార్‌ (అలియాస్‌ కేఈ కుమార్‌) 2016లో కొనుగోలు చేశారు. ఆ భూమిని ఆన్‌లైన్‌లోనూ, అడంగల్‌ రికార్డులను ఆయన పేరు మీదకి మార్చుకోవడంతోపాటు పాస్‌బుక్‌ సైతం పొందారు. ఆయన ఖాతాకే రైతు భరోసా డబ్బులు జమవుతున్నాయి. పూజారి జయలక్ష్మి అనే మహిళ ఆ స్థలాన్ని 1988లో కొనుగోలు చేశారు. దానిని 1998లో రంగారావు అనే వ్యక్తికి రాసిచ్చారు. అతని నుంచి స్థలాన్ని కొనుగోలు చేసేందుకు 2011లో ఒప్పందం చేసుకుని.. 2016లో కె.వి.కుమార్‌ కొనుగోలు చేశారు. అదే స్థలాన్ని మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ శమంతకమణి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో అది కాస్తా ఆలస్యం అయింది. కేసు విచారణ జరుగుతుండగానే.. ఆ భూమిని అధికారులు నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. దీంతో ఆ భూమిని మరొకరు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అవకాశం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జనవరి 19న పూజారి ప్రకాశ్‌రావు అనే వ్యక్తి ఆ 40 సెంట్ల స్థలాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, ఆమె అనుచరుడు రఘుపతిరెడ్డికి విక్రయించారు. తాను జయలక్ష్మి కుమారుడినని.. తన తల్లి చనిపోయిన నేపథ్యంలో ఆ స్థలం తనకు వారసత్వంగా సంక్రమించిందంటూ పూజారి ప్రకాశ్‌రావు పత్రాలు చూపారు. ఇందుకోసం జయలక్ష్మి పేరుతో ఒక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించారు. దీనిపై కె.వి.కుమార్‌ ఆరా తీయగా.. జయలక్ష్మికి అసలు కుమారులే లేరని వెలుగులోకి రావడం గమనార్హం. సుజాత అనే మహిళ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జయలక్ష్మి మరణ ధ్రువీకరణ పత్రంగా మార్చి రిజిస్ట్రేషన్‌ అధికారులకు అందించినట్లు తేలింది.  ఒరిజినల్‌ ధ్రువపత్రాలను పరిశీలించకుండా కేవలం ఫొటోస్టాట్‌ కాపీల ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌ జరిగిందని తెలిసి అధికారులను ఆశ్రయించినా.. అది రద్దు చేసినట్లు లిఖితపూర్వక పత్రాలు ఇవ్వడంలేదు. దీనిపై నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయిస్తే నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని