logo

వసతిగృహాల్లో ఆకలికేకలు

విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్‌ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు

Published : 29 Mar 2024 06:25 IST

 బిల్లులు రాక సంరక్షకుల గగ్గోలు 

 విద్యార్థుల భోజనంపై ప్రభావం

వసతిగృహంలో భోజనం చేస్తున్న బాలికలు

 డోన్‌పట్టణం, కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే: విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్‌ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు. గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టే సంరక్షకులకు దాదాపు ఏడునెలల బిల్లులు చెల్లించాలి. బిల్లులు రాకపోవడంతో వారంతా దిగులు చెందుతున్నారు.

ఖర్చులు చేస్తున్నారిలా...!

 300 మంది, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే నెలకు 10 నుంచి 12 వరకు గ్యాస్‌ సిలిండర్లు తెప్పించాలి.  కూరగాయలు, వంటనూనె, చికెన్‌, పాలు, గుడ్లు, అరటిపండ్లు తదితర వాటిని కొనుగోలు చేయాలి. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం మెనూ ప్రకారం స్నాక్స్‌, భోజనం ఇవ్వాలి. పాఠశాలలు ఉన్న సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటారు. సెలవురోజుల్లో వసతిగృహాల్లోనే భోజనం చేస్తారు. ప్రభుత్వం కేవలం బియ్యం, చిక్కీలను మాత్రమే అందిస్తుంది. మిగతా వాటిని వార్డెన్లు ఖర్చు చేసి బిల్లులు పెట్టుకోవాలి. సగటున నెలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పైగానే ఖర్చవుతోందని, ప్రభుత్వం స్పందించి బిల్లులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

అప్పులు తెస్తూ...

సంరక్షకుల బిల్లుల అప్‌లోడ్‌కు ప్రభుత్వం టోకెన్‌ నంబర్లను ఇవ్వట్లేదనేది సమాచారం. వసతిగృహాల సంరక్షకులు ప్రతి నెలలో ఒకటో తేదీ నుంచి 5వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో బిల్లులు పెట్టాక...అవన్నీ ఏఎస్‌డబ్ల్యువో, ఏబీసీడబ్ల్యువో, ఏటీడబ్ల్యువోల లాగిన్‌కు వెళ్తాయి. సీఎఫ్‌ఎంఎస్‌లో అప్రూవల్‌ చేసిన తర్వాత ట్రెజరీలకు చేరుతాయి. సెప్టెంబరు, అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్‌లో సంరక్షకులు బిల్లులు పెడుతున్నా..సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు జనరేట్‌ చేసే ఆప్షన్‌ పనిచేయకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయంటున్నారు. ఆయా శాఖల అధికారులను అడిగితే సీఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్‌ ఫ్రీజింగ్‌లో ఉందని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక తమకు వచ్చే వేతనాల్లో సర్దుబాటు చేస్తూ సంరక్షకులు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అప్పులు తెస్తున్నారు. ఒకవైపు కుటుంబాల బాధ్యతలతో పాటు విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ సంగతి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ, ఎస్సీ వసతిగృహాలు (ప్రీ-మెట్రిక్‌) 108 వరకు ఉండగా, 16 వేల మంది ఉంటున్నారు. కళాశాలల వసతిగృహాలు (పోస్టుమెట్రిక్‌) ఉమ్మడి జిల్లాలో 48 ఉండగా, రెండువేల మందికి పైగా చదువుతున్నారు. ఎస్టీ ఆశ్రమ, రెసిడెన్షియల్‌ వసతిగృహాలు 20 ఉండగా..ఇందులో 2,289 మంది ఉంటున్నారు. 3 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు ఒక్కొక్కరికి రూ.1,250లు, ఆరు నుంచి పదో తరగతి వారికి రూ.1,400లు, పోస్టు మెట్రిక్‌కు సంబంధించి ఇంటర్‌ నుంచి పీజీ వరకు విద్యార్థులకు రూ.1,600ల చొప్పున డైట్‌ ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని