logo

గద్దెనెక్కారు.. కొండలు కూల్చారు

ఆపదలో ఆదుకుంటాడని.. అవసరమొస్తే సాయం చేస్తాడని నమ్మి మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటేశాం.. తీరా గద్దెనెక్కాక.. ప్రజా అవసరాలు మరిచారు.. ఊళ్లకు దారి వేయలేదు.. గుక్కెడు నీరివ్వలేదు..

Published : 10 May 2024 03:01 IST

ఆపదలో ఆదుకుంటాడని.. అవసరమొస్తే సాయం చేస్తాడని నమ్మి మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటేశాం.. తీరా గద్దెనెక్కాక.. ప్రజా అవసరాలు మరిచారు.. ఊళ్లకు దారి వేయలేదు.. గుక్కెడు నీరివ్వలేదు.. చెరువును బాగు చేయలేదు... ఐదేళ్లలో ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేదు. మన ఊరి పక్కనున్న కొండలను పిండి చేశారు. ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు, అనుచరుల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అక్రమ తవ్వకాలతో కొండలు.. చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. కబ్జాలు, సహజ వనరుల దోపిడీనే ఆదాయ మార్గంగా మార్చుకున్నవారి చెరలో పడిన తటాకాలు పూర్తిగా రూపుకోల్పోతున్నాయి. మట్టి వ్యాపారం చేస్తూ నిత్యం రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. చెరువులపై ఆధారపడిన రైతులకు కన్నీరు మిగిల్చారు. ఐదేళ్లు ఆపద్బాంధవులుగా నిలవాల్సినవారు ప్రకృతి సంపదను దోచేశారు.!

రూ.9.50 కోట్లు మెక్కేశారు

కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలో ఏపీఎస్పీ బెటాలియన్‌కు కేటాయించిన 200 ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వేశారు. 1,71,308 క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టిని తవ్వి రవాణా చేసినట్లు తేల్చారు. 9 మందిని బాధ్యులుగా గుర్తించి రూ.9.50 కోట్లు చెల్లించాలని తాఖీదులిచ్చారు. వాస్తవంగా పరిశీలిస్తే 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకాలు జరిగాయని, రూ.30 కోట్ల విలువ చేసే ఎర్రమట్టిని తినేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

 హంద్రీ కట్టలు ఖతం చేశారు

 హంద్రీనీవా కాల్వ మట్టి అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది.. కాల్వ పరిధిలోని గ్రామాల్లో నేతలకు గుత్తేదారులు కప్పం కట్టి తీసుకెళ్లారు.. రక్షణ కోసం ఇరువైపులా వేసిన ఎత్తైన మట్టి కట్టలు ఖతం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల నుంచి పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర వరకు 134 కి.మీ. మేర కాల్వ విస్తరించి ఉంది. కాల్వకు ఇరువైపులా ఉన్న మట్టిని అధికార పార్టీ నాయకులు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పటికే లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు.

ఆదోనిలో రూ.10 కోట్లు ఆరగించారు

ఎస్‌.కొండాపురం కొండల్లో మట్టిని తరలించడంతో ఏర్పడిన గుంతలు

ఆదోని నియోజకవర్గ పరిధిలోని ఎస్‌.కొండాపురం, గణేకల్లు, జి.హొసళ్లి, ఇస్వీ గ్రామ సమీపంలోని కొండలను అధికార పార్టీ నాయకులే తవ్వేశారు. ఒక్కో టిప్పర్‌కు రూ.4 వేలు, ఒక్కో ట్రాక్టరుకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేశారు. ఎస్‌.కొండాపురం కొండలను పరిశీలిస్తే కేజీఎఫ్‌ సినిమా తరహాలో అక్కడ తవ్వకాలు సాగుతున్నాయి. సర్వే నంబరు-1లో సుమారు 764 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఎర్రమట్టి కోసం తవ్విన గుంతలే కనిపిస్తున్నాయి. నిత్యం 60 వరకు టిప్పర్లు, 40 ట్రాక్టర్లలో తరలించారు.

70 ఎకరాల కొండకు గుండు

ఎమ్మిగనూరు మండలం పరమాన్‌దొడ్డి కొండ సుమారు 70 ఎకరాలకుపైగా విస్తరించి ఉంది. కొండ చుట్టూ ఎర్రమట్టిని తవ్వుకున్నారు. ఒక ట్రిప్పు రూ.300 వరకు అమ్ముకున్నారు. ఈ కొండను తవ్వేసి మట్టిని ఏకంగా అక్రమ వెంచర్లకు తరలించారు. ఫలితంగా కొండ ప్రాంతమంతా గుండుగా తయారైంది. నాలుగేళ్లలో సుమారు 40 ఎకరాలకుపైగా కొండ ప్రాంతంలో తవ్వేశారు. ప్రస్తుతం గుంతలే కనిపిస్తున్నాయి.

బనవాసి వనంలో ‘తోడే’ళ్లు

బనవాసి ఫారంలోని టేకుల వనంలో 7 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రమట్టిని కొందరు వ్యక్తులు తవ్వేశారు. చెట్లు సైతం తొలగించి గుంతలు చేశారు. ఫారం కానుగ చెట్లలో ఎర్ర గరుసు తవ్వారు. ప్రభుత్వ భూములు కావడంతో అధికారులెవరూ పట్టించుకోలేదు. ఐదేళ్లలో రూ.లక్షల విలువ చేసే ఎర్రమట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.

ఇక్కడా మేశారు

  • ఎమ్మిగనూరు మండలం మాసుమాన్‌దొడ్డి కొండ సుమారు 500 ఎకరాలకుపైగా ఉంది. కొండకున్న గరుసును నాయకులే రూ.800 నుంచి రూ.1,500 చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. కొండ రూపురేఖలు మారిపోయింది.
  • మంత్రాలయం నియోజకవర్గంలో హనుమాపురం కొండ విస్తీర్ణం 50 ఎకరాలకుపైగా ఉంది. రాళ్లు, ఎర్ర గరుసును కొందరు అమ్ముకున్నారు. దాదాపు 35 ఎకరాల మేర మట్టి మాయమై గుంతలే కనిపిస్తున్నాయి
  • పత్తికొండ మండలం దూదేకొండ సమీపంలోని తిప్పగుట్ట సర్వే నంబరు 799లో సుమారు 50 ఎకరాల మేర విస్తరించి ఉంది.  అక్రమార్కుల చేతిలో కరిగిపోయాయి.
  • సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డిలో ఐదెకరాల్లోని ఎర్రమట్టి కొండను ఇష్టానుసారంగా తవ్వేశారు. ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకున్న వైకాపా నేతలు కొండను తవ్వి ఎర్ర మట్టిని పెద్దఎత్తున తరలించారు. ఒక్కో టిప్పర్‌కు దూరాన్ని బట్టి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేశారు.
  • గూడూరు మండలంలోని బూడిదపాడు గ్రామంలో చంద్రాయినితిప్ప ఎర్ర మట్టి కొండ ఉంది. తిప్పను మొత్తం తవ్వేశారు. నిత్యం పొక్లెయిన్లతో తవ్వి ప్రకృతి సిద్ధమైన కొండను మాయం చేస్తున్నారు.
  • ఎమ్మిగనూరు నియోజకవర్గం తిమ్మాపురం కొండమ్మ చెరువులో సుమారు 8 ఎకరాల్లో బంక మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ఒక్కో ట్రాక్టర్‌ను రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయించారు. ఇలా రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులే యథేచ్ఛగా తవ్వేయడంతో ఇప్పుడు గుంతలు మిగిలాయి.

జగన్నాథ గట్టును తోడేశారు

కల్లూరు మండలం లక్ష్మీపురం రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 793-1, కర్నూలు గ్రామీణ మండలం దిన్నెదేవరపాడు రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 478లో, బి.తాండ్రపాడు కలిపి సుమారు వెయ్యి ఎకరాలకుపైగా జగన్నాథగట్టు విస్తరించింది. వందల ఏళ్ల కిందటి నుంచే ఎంతో చరిత్రాత్మక ప్రాంతంగా గుర్తింపు పొందింది. రూ.కోట్ల విలువైన నాణ్యమైన ఎర్రమట్టి (గరుసు) నిక్షేపాలకు నిలయంగా ఉంది. రహదారి పనుల పేరుతో అధికార పార్టీ నేతలు మట్టిని అమ్మేశారు.

తడకనపల్లెను తవ్వేశారు

కల్లూరు మండలం తడకనపల్లెలో ఎర్రమట్టి కొండలను ఇష్టానుసారంగా తవ్వేశారు. నిత్యం వందలాది వాహనాల్లో మట్టిని తరలించారు. ‘అధికారం’ అండదండలతోనే కల్లూరు ప్రాంతానికి చెందిన మట్టి మాఫియా కొండలను మింగేస్తోందన్న ఆరోపణలున్నాయి. సర్వే నంబరు 336లో నెల రోజులుగా అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్త పొక్లెయిన్లతో తవ్వకాలు చేపట్టారు. నెల రోజుల వ్యవధిలో 400 టిప్పర్ల ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ.5 వేలకు అమ్ముతున్నారు. ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా, ఎలాంటి పెట్టుబడులు లేకుండా నెల రోజుల్లోనే రూ.20 లక్షలకుపైగా ఆర్జించడం గమనార్హం.
- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, కల్లూరు గ్రామీణ, ఆదోని గ్రామీణ, మద్దికెర, ఎమ్మిగనూరు, కోడుమూరు గ్రామీణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు