logo

జగన్‌ సభ.. అబద్ధాలకు వేదిక

నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు.

Published : 10 May 2024 03:07 IST

 ఐదు రహదారుల కూడలి వద్ద పోలీసుల ఆంక్షలు
ఈనాడు, కర్నూలు, న్యూస్‌టుడే, కర్నూలు నగరం, కర్నూలు వైద్యాలయం: నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు. సభలో హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణం పూర్తైనట్లు చెప్పడం గమనార్హం. వాస్తవానికి అందులో ఎలాంటి వైద్య పరికరాలు అందుబాటులోకి రాకుండానే ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా ప్రారంభించేశారు. నేటికీ రోగులకు వైద్యం అందని పరిస్థితి. క్లస్టర్‌ విశ్వవిద్యాలయ భవన నిర్మాణాలు పూర్తైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాస్తవానికి నిర్మాణాలు పూర్తి కాలేదు. వచ్చే విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం లేదు. సుంకేసుల నుంచి పైపులైను నిర్మాణం 80 శాతం పూర్తైందన్నారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగరానికి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి తెచ్చారని గొప్పగా ప్రకటించారు. అసలు నిర్మాణాలు ప్రారంభంకాకపోవడం గమనార్హం. కర్నూలును న్యాయ రాజధానిగా చేసిన గొప్ప వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే కీర్తించారు. కర్నూలుకు హైకోర్టును తెస్తామని చెప్పి కనీసం హైకోర్టు బెంచి కూడా ఏర్పాటుచేయలేకపోయారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. వైకాపా హయాంలో ఇప్పటివరకు కనీసం నీటి సదుపాయం కల్పించలేకపోయారు. గత ఐదేళ్లలో మచ్చుకు ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు.

  • బీవీ రామయ్య భజన పర్వం: కర్నూలు పార్లమెంటు వైకాపా ఎంపీ అభ్యర్థి బి.వై.రామయ్య ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అంబేడ్కర్‌, ఫులె, గాంధీని కలగలిపితే ఏర్పడ్డ శిల్పమే జగన్‌మోహన్‌రెడ్డి అంటూ చెప్పడం గమనార్హం.
  • చంద్రబాబుపై నెపం నెడుతూ: వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబునాయుడు అడ్డుకున్నారని కేడీసీసీ బ్యాంకు ఛైర్‌పర్సన్‌ విజయమనోహరి ఆరోపించారు. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయంలో 14 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పటికీ వారితో పింఛన్లు పంపిణీ చేయకుండా పభుత్వం మొండిగా వ్యవహరించింది. దీనిని పక్కదారి పట్టించి చంద్రబాబుపై అభాండాలు వేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు