logo

ప్రయాణం.. జర భద్రం

హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి-756 ప్రమాదకరంగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక చోట ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Updated : 01 Feb 2023 19:10 IST

ఏటా సగటున ప్రమాదాలిలా..
ప్రమాదాలు : 120
మరణాలు : 112 మంది
క్షతగాత్రులు: 160 మంది

జనవరి 29న మహబూబ్‌నగర్‌ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ప్రమాదం అంచు వరకు వెళ్లింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తున్న ఈ బస్సు శ్రీశైలం ప్రాజెక్టు దృశ్య కేంద్రం సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఆనుకోని ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఆ సమయంలో ఈ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇనుప రెయిలింగ్‌ ఉండడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయట పడ్డారు. లేకుంటే బస్సు లోయలో పడి పెనుప్రమాదం సంభవించేదని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.


హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారిలో గతేడాది జులైలో ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అతి వేగం, ఓవర్‌ టేక్‌ చేయడమే ప్రమాదానికి కారణం. చెన్నారం గేట్‌ సమీపంలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ రహదారిపై దోమలపెంట చౌరస్తా, పాతాళగంగ రోడ్డు, వంగూరు, వెల్దండ, కడ్తాల్‌, డిండి రోడ్డు సమీపంలో గతంలో పలు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు.

ప్రమాదకరంగా ఉన్న శ్రీశైలం ఘాట్‌ రోడ్డులోని ఓ మలుపు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి-756 ప్రమాదకరంగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక చోట ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆమనగల్లు, కల్వకుర్తి, అచ్చంపేట, మన్ననూరు, దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగ మీదుగా ఏపీలోని దోర్నాల వరకు వెళ్తుంది.  హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు నిత్యం ఈ రహదారి మీదుగానే భారీగా వాహనాల రాకపోకలుంటాయి. ఆర్టీసీ బస్సులతోపాటు సొంత వాహనాలు, అద్దె కార్లలో ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్డుపై డివైడర్లు లేకపోవడంతో ఓవర్‌టేక్‌ చేయడానికి ఎక్కువగా ఆస్కారాలున్నాయి. ఎదురెదురుగా వేగంగా వాహనాలు వచ్చి ఢీ కొడుతున్నాయి. ఈ ప్రాంతంలో డివైడర్లు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. ఇక్కడ స్పీడ్‌గన్‌ ద్వారా జరిమానాలు లేకపోవడంతో వేగ నియంత్రణపై అదుపు తప్పి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మద్యం దుకాణాలతో ఇబ్బందులు.. : అచ్చంపేట దాటిన తర్వాత ఘాట్‌ రోడ్డులున్నాయి. మన్ననూరు, దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగతోపాటు ఏపీ పరిధిలోని సున్నిపెంట మీదుగా శ్రీశైలం వరకు ప్రమాదకర మలుపులున్నాయి. ఈ మార్గంలో అనుభవం ఉండి, ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఆర్టీసీ డ్రైవర్లకే విధులు కేటాయిస్తారు. అయినా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వాహనాలు వేగంగా వెళ్లడం, మలుపు వద్ద అజాగ్రత్తగా ఉండటంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. శ్రీశైలం మార్గం అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో పరిధిలో ఉండటంతో పెద్ద ఎత్తున వేగ నియంత్రికలున్నాయి. ఇవి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కల్వకుర్తి దాటి నల్లమలలో ప్రవేశించిన తర్వాత అడుగడుగునా మద్యం దుకాణాలే కనిపిస్తాయి. అక్కడే సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తారు. తాగి వాహనాలు నడుపుతుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.


హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాం. ప్రస్తుతం వెల్దండ వద్ద స్పీడ్‌ గన్‌ ఉంది. అదనంగా అచ్చంపేట-అమ్రాబాద్‌ రోడ్డు మరో రెండు ఏర్పాటు చేస్తాం. ఈ రోడ్డుపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తాం. అనుమతుల్లేకుండా ఎక్కడైనా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.

మనోహర్‌, ఎస్పీ, నాగర్‌కర్నూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని