logo

ఊరడించి.. ఉసూరుమనిపించె

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి జిల్లాలోని వివిధ వర్గాలకు కొంత ఆశాజనకంగానే ఉంది.

Updated : 02 Feb 2023 09:55 IST

కేంద్ర బడ్జెట్‌లో పాలమూరుకు మోదం, ఖేదం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి జిల్లాలోని వివిధ వర్గాలకు కొంత ఆశాజనకంగానే ఉంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో వీటికి బడ్జెట్‌లో నిధులు ఎక్కువగా కేటాయించడం రైతులకు ఊరట కలిగించే అంశం. సన్న, చిన్నకారు రైతులకు రుణాల పెంపు ఆసరాగా నిలవనుంది. మహిళా సంఘాలకు రుణాలు పెంచనుండటంతో ఆర్థిక స్వావలంబనకు బాటలు పడనున్నాయి. పాలమూరుకు ప్రత్యేక ప్రాజెక్టులు రాకపోవడం నిరాశకు గురిచేసింది. ప్రాజెక్టులు, విద్య రంగానికి ప్రత్యేక ప్రకటనలు ఉంటాయని ఆశించగా మొండిచెయ్యే చూపారు.

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

రైతులకు లబ్ధి..

బడ్జెట్‌లో సన్న, చిన్నకారు రైతులకు తనఖా లేని రుణపరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.60 లక్షలకు పెంచింది. ఉమ్మడి జిల్లాలో ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులే ఎక్కువ. వీరికి బ్యాంకులు ఇచ్చే రుణాలే ఆధారం. లేకుంటే అప్పులు చేయాల్సిందే. కేంద్రం ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో 2.87 లక్షల మందికి ఊరట కలగనుంది.


పరిశ్రమలకు ప్రోత్సాహం

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ బడ్జెట్‌లో ప్రోత్సాహం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనికోసం క్రెడిట్‌ గ్యారెంటీని కల్పించడం, రూ.9 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ను తీసుకురావడం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 30వేల మంది టీఎస్‌ఐపాస్‌ ద్వారా వివిధ పరిశ్రమల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ఉమ్మడి జిల్లాలో 18,576 మంది రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. వీటి ద్వారా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


గ్రామపంచాయతీ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,690 గ్రామపంచాయతీలు ఉన్నాయి. భౌగోళిక, భాషాపరమైన, కళలతోపాటు వివిధ రంగాలకు చెందిన పుస్తకాలను ఈ గ్రంథాలయంలో అందుబాటులోకి తీసుకురావొచ్చని ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. చిన్నారులు, యుక్త వయస్సు వారీ కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీల కోసం మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 400 గ్రామపంచాయతీల్లో ఈ-పాలన నడుస్తోంది.  


వేతన జీవులకు ఊరట..

వేతన జీవులకు ఎంతో ఊరట కలిగించే నిర్ణయాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఆదాయపు పన్ను మినహాయింపును రూ.7 లక్షలకు పెంచింది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 69 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో వార్షిక ఆదాయం రూ.7 లక్షల్లోపు ఉన్నవారు సుమారు 70శాతానికిపైగానే ఉన్నారు. వీరికి ఈ నిర్ణయం మేలు కలిగించనుంది. వ్యక్తిగత ఆదాయ పన్నును రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల మందికి మేలు జరగనుంది.


మహిళా సంఘాలకు రుణాలను మరింత పెంచి ఆర్థిక స్వావలంబన కల్పించాలని విత్తమంత్రి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో 47వేల సంఘాలుండగా అందులో 5.30 లక్షల మంది సభ్యులున్నారు. గతేడాది 22 వేల సంఘాలకు రూ.862 కోట్ల రుణాలు అందించారు. ఈసారి కేటాయింపులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం తీసుకొస్తున్న మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ పథకం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం కూడా అతివలకు ఉపయోగకరంగా మారనుంది.


ప్రత్యేక ప్యాకేజీలు లేవు..

పలు వర్గాలను కేంద్ర బడ్జెట్‌ సంతృప్తిపరిచినప్పటికీ పాలమూరుకు చెందిన పలు ప్రాజెక్టులపై కరుణ చూపలేదు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదా ప్రత్యేక నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 12.30లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందించే ఈ పథకానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.53వేల కోట్లు అవసరం. నిధులు అనుకున్నంత స్థాయిలో కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాలమూరులో సైనిక పాఠశాల ఏర్పాటు ప్రకటనలకే పరిమితమవుతోంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల ఊసే లేకపోవడం ఈ ప్రాంతవాసులకు కొంత నిరుత్సాహాన్ని కలిగించింది.


పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. ఇల్లు కొనుగోలుదారుకు ఇదీ ఎంతో ఊరటనిచ్చే అంశం. ఉమ్మడి జిల్లాలో 1.88 లక్షల కుటుంబాలు ఇప్పటికీ ఎలాంటి ఆధారం లేకుండా జీవిస్తున్నాయి. మరో 55 వేల కుటుంబాలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా సామాన్యుడు సొంతింటి కలను నేరవేర్చుకునే అవకాశాలున్నాయి.


బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా రైతులకు అందించే రుణాల లక్ష్యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు రూ.21వేల కోట్ల రుణాలు అందిస్తున్నారు. అందులో వ్యవసాయ రంగానికే రూ.18 వేల కోట్ల కేటాయిస్తున్నారు. ఏటా 9 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.


వ్యవసాయ పరపతి సంఘాలు : 76
అవసరమయ్యే నిధులు : రూ.3,04,00,000

మహబూబ్‌నగర్‌ డీసీసీబీ పరిధిలో మొత్తం 76 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో 8 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కర్షకులు రుణాల కోసం ఎక్కువగా ఈ సంఘాలనే ఆశ్రయిస్తారు. దేశంలోని సంఘాలన్నింటినీ కంప్యూటరీకరించడానికి  కేంద్రం రూ.2,516 కోట్లు కేటాయించింది. ఒక్కో సంఘం కంప్యూటరీకరణకు రూ.4 లక్షలు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఉన్న 76 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు రూ.3.04 కోట్లు అవసరం అవుతాయి.
నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్డండ, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో ఏకలవ్య పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. వెల్డండ పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులుండగా 26 మంది బోధన సిబ్బందికిగాను 3 ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై ఉన్నారు. మిగతా 23 మంది పొరుగు సేవల్లో పని చేస్తున్నారు. బోధనేతర సిబ్బందిలో 23 మంది పొరుగు సేవల్లో పని చేస్తున్నారు. బాలానగర్‌ పాఠశాలలో 416 మంది విద్యార్థులుండగా 22 మంది ఉపాధ్యాయులకుగాను 12 మంది రెగ్యులర్‌ బోధన సిబ్బంది ఉన్నారు. మిగిలిన వారు పొరుగు సేవల ద్వారా పని చేస్తున్నారు. ఇక్కడ బోధేనేతర సిబ్బంది 12 పొరుగు సేవల్లోనే పని చేస్తున్నారు.


శ్రీఅన్న పథకంతో ఉపయోగాలు..

ఉమ్మడి జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుకు అనువైన ప్రాంతాలున్నాయి. రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, సజ్జలు సాగు చేసేందుకు భూమి అనువుగా ఉన్న ప్రాంతాలను గతంలోనే వ్యవసాయ అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు ఈ పంటలకు అనువుగా ఉంటాయి. బడ్జెట్‌లో ఈ పంటల అభివృద్ధితోపాటు రైతుల సంక్షేమం, ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన ‘శ్రీఅన్న’ కార్యక్రమం సుమారు 1.20 లక్షల మంది రైతులకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.


కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికిగానీ, పాలమూరుకుగానీ ఒరిగిందేమీ లేదు. పక్కన ఉన్న కర్ణాటకలో సాగునీటి కోసం రూ.5వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. ఆ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న పాలమూరుకు మాత్రం మొండిచెయ్యి చూపారు. ఈ జిల్లాలో కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధే కనిపిస్తోంది.

మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ, మహబూబ్‌నగర్‌


కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రకటనకే పరిమతం కాకుండా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ బడ్జెట్‌లో సామాజిక అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. పాలమూరు కూడా ఆ జాబితాలో ఉంది. ఈ ప్రాంతానికి నిధుల కేటాయింపులు ఉండాలి. ఆదాయపు పన్ను పరిమితి పెంచినా ప్రస్తుతం అన్ని ధరల పెరిగాయి. అందువల్ల ఇదీ ఊరట కలించే అంశంగా అనుకోలేం.

రాఘవేందర్‌, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌, పీయూ


కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ ప్రజలు గర్వించేదిగా ఉంది. సామాన్య ప్రజలు, రైతులకు మరింత సానుకూలంగా ఉంది. మహిళల సాధికారత కోసం ఈ బడ్జెల్లో రుణ కల్పనను విస్తృత పరిచారు. ఎస్టీల అభ్యున్నతికి గిరిజన మిషన్‌, మత్స్యకారుల కోసం మత్స్యయోజన ప్రవేశపెడుతున్నారు. వివిధ వర్గాల ప్రజలకు వారి వృత్తులకు అనుగుణంగా వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కేంద్రం బడ్జెట్‌ రూపకల్పన చేసినందుకు గర్వపడుతున్నా.

వీరబ్రహ్మాచారి, భాజపా జిల్లా అధ్యక్షుడు


పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా నిరాశ పరిచింది.కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పూర్తిగా మొండి చేయి మిగిలింది. రాష్ట్రానికి ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించలేదు. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చిత్తశుద్ధి చూపలేదు.

మధుసూదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు