logo

మళ్లీ తెరపైకి పత్తి విత్తన శుద్ధి

జోగులాంబ గద్వాల జిల్లాలోని విత్తన శుద్ధి కేంద్రాల్లో డీలింటింగ్‌ ప్రక్రియను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. నిర్వాహకులు కాలుష్య రహిత యంత్రాలంటూ మళ్లీ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

Published : 24 Mar 2023 05:44 IST

కాలుష్యంపై ఆందోళనలతో రెండేళ్లుగా ఆగిన వైనం

ప్రక్రియ అనంతరం వెలువడుతున్న వ్యర్థ జలం (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: జోగులాంబ గద్వాల జిల్లాలోని విత్తన శుద్ధి కేంద్రాల్లో డీలింటింగ్‌ ప్రక్రియను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. నిర్వాహకులు కాలుష్య రహిత యంత్రాలంటూ మళ్లీ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు కొత్త యంత్రాల కోసం వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ విత్తన పత్తిని డీలింటింగ్‌ చేసే పరిశ్రమలున్నాయి. గత రెండేళ్లుగా జిల్లాలో ఈ ప్రక్రియ ఆగిపోయింది. హరిత ట్రైబ్యునల్‌ నుంచి మొట్టికాయలు పడటం, భారీగా జరిమానా వేయడం, స్థానికులు, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆపేశారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఈ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రధాన విత్తన కంపెనీలతో నిర్వాహకులు మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం.

శుద్ధి చేస్తారిలా..

విత్తన శుద్ధి కేంద్రాల్లో దూది నుంచి గింజలను వేరు చేస్తారు. అలా వేరు చేసిన అనంతరం ఆ గింజలకు కొద్దిగా దూది అతుక్కొని ఉండిపోతోంది. ఆ దూదిని కూడా వేరు చేయడానికి ఆ గింజలను డీలింటింగ్‌ చేస్తారు. సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌, సున్నం రసాయనాలను పోసి శుద్ధి చేస్తారు. ఇలా చేసిన  తర్వాత వచ్చే వ్యర్థాలను స్థానికంగానే భూమిలో గుంత చేసి వదిలేస్తున్నారు. దీంతో భూమి సారవంతం కోల్పోవడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చుట్టు పక్కల భూముల్లో పంటలు పండటం లేదు. వివిధ శాఖల అధికారులు, ముఖ్య నేతలకు ఏటా పెద్ద ఎత్తున ఈ కంపెనీల నుంచి మాముళ్ల రూపంలో వెళ్తుండటంతో వీటిని ఎవరూ అడ్డుకోవడం లేదు. వీటిపై కొందరు హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో రెండేళ్ల కిందట విత్తనశుద్ధి కేంద్రాల్లో ఈటీపీ(రసాయనాల శుద్ధీకరణ ప్లాంటు) ద్వారా డీలింటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. వీటి ద్వారా కలుషిత జలాలు రావని పరిశ్రమల్లో ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా కూడా భూగర్భ జలాలు కలుషితం అవుతుండడం, రైతుల నుంచి ఆందోళనలు రావడంతో ప్రస్తుతానికి ఈ ప్రక్రియను కూడా జిల్లాలో ఆపేశారు.


50వేల ఎకరాల్లో సాగు..

జిల్లాలో ఏటా సుమారు 50వేల ఎకరాల్లో విత్తన పత్తిని సాగు చేస్తారు. దేశంలోనే 25శాతం విత్తన పత్తి సాగు గద్వాల జిల్లాలోనే ఉంటుంది. గట్టు, కేటీదొడ్డి, ధరూరు, అయిజ, మల్దకల్‌, గద్వాల, వడ్డేపల్లి మండలాల్లో ఈ సాగు అధికంగా ఉంటుంది. జిల్లాలోని ప్రధాన ఆర్గనైజర్లు ప్రముఖ పత్తి విత్తన కంపెనీల ద్వారా స్థానికంగా రైతులతో సాగు చేయిస్తున్నారు. పేద రైతుల అవసరాలను ఆసరా చేసుకుని ఆర్గనైజర్లు ఈ సాగు ఖర్చు కోసమని ఏటా రూ.లక్షల్లో పెట్టుబడి రుణాలు ఇస్తున్నారు. సాగు పూర్తయిన తర్వాత వారి విత్తన శుద్ధి కేంద్రాలకే పంటలను తరలించాలి. అక్కడే డీలింటింగ్‌ ప్రక్రియను చేపడతారు. రెండేళ్లుగా ఈ ప్రక్రియను ఆపేయడంతో నిర్వాహకులకు వచ్చే లాభాలపై ప్రభావం చూపింది. దీంతో మళ్లీ ఈ ప్రక్రియను ప్రారంభించాలని చూస్తున్నట్లు ‘ఈనాడు’తో ఓ ఆర్గనైజర్‌ చెప్పడం గమనార్హం.


భారీ జరిమానా వేసినా..

జిల్లాలో ఈ ప్రక్రియపై ఓ వ్యక్తి మూడేళ్ల క్రితం హరిత ట్రైబ్యునల్‌కు వెళ్లడంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి నలుగురు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి నలుగురు, కలెక్టర్‌ సభ్యులుగా ఓ సంయుక్త కమిటీని నియమించింది. ఆ కమిటీ జిల్లా కేంద్రంలోని పలు జిన్నింగ్‌ మిల్లులను పరిశీలించి నివేదికను హరిత ట్రైబ్యునల్‌కు అందించారు. ఆ నివేదికల్లో కాలుష్యం జరుగుతుందని తేల్చడంతో విత్తనశుద్ధి కేంద్రాలకు భారీగా జరిమానా విధించారు. స్థానికులు ఆందోళన చేయడంతో ప్రస్తుతానికి ఆపివేశారు. రూ.కోట్లలో ఆదాయం ఉండటంతో ఈ వ్యవస్థను మళ్లీ ముందుకు తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని