logo

24 గంటల్లో ధాన్యం దింపుకొనేలా చర్యలు

జిల్లాలో కేఎల్‌ఐ ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడంతో ఏటికేడు వరి సాగు అధికమవుతోందని, ఇందుకనుగుణంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ పేర్కొన్నారు.

Published : 07 Jun 2023 04:03 IST

‘న్యూస్‌టుడే’తో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : జిల్లాలో కేఎల్‌ఐ ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడంతో ఏటికేడు వరి సాగు అధికమవుతోందని, ఇందుకనుగుణంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ పేర్కొన్నారు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నామని, మిల్లర్లతో ఇటీవల కలెక్టర్‌, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించి చర్చించారన్నారు. అధికారులకు ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ఇంటర్య్వూ విశేషాలు ఇవీ..

ప్ర : రైస్‌ మిల్లుల వద్ద రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తెచ్చి వారం, పది రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. జాప్యాన్ని ఎలా నివారిస్తారు.?

జ : లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులే ధాన్యాన్ని ట్రాక్టర్లలో తెచ్చేందుకు అనుమతి ఇచ్చాం. సమస్య తీవ్రత దృష్ట్యా 24 గంటల్లో తెచ్చిన ధాన్యాన్ని దింపుకోవాలని మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. మిల్లుల్లోనూ తనిఖీలు చేస్తున్నాం. సంబంధిత గుత్తేదారుడితో ట్రాక్టర్లకు కిరాయి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో రైతులకు మిల్లుల వారి మధ్యన సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆలస్యం అవుతోంది. సమస్య ఉన్నట్లుగా ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్నాం.

ప్ర : రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించటం లేదన్న ఫిర్యాదులపై స్పందన ?

జ : రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 2నే రూ.30కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నాలుగు రోజుల కితం రూ.20 కోట్లు వచ్చాయి. ధాన్యం దింపుకున్న తర్వాత రైతుల ఖాతా నంబర్ల నమోదు ప్రక్రియలో కొంత జాప్యం అవుతోంది. అంతేతప్పా డబ్బులు చెల్లించడంలో జాప్యం కావడం లేదు.

ప్ర : ప్రతి సీజన్‌లో లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తోంది. నిల్వల కోసం సరిపడా గోదాంలు సిద్ధం చేశారా?

జ : ధాన్యం నిల్వలకు ప్రస్తుతం ఇబ్బంది లేదు. జిల్లాలో 127 రైస్‌ మిల్లులు, 13 పారాబాయిల్డ్‌ మిల్లులున్నాయి. అందులో నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్‌ శాఖ నుంచి ఏడు గోదాంలను రిజర్వు చేసి ఉంచాం. ఈ ఏడాది ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 15 గోదాంలు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయితే ప్రభుత్వ పరంగానే ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం ఉంది.

ప్రశ్న : క్వింటాకు తాలు పేరుతో 6 నుంచి 9 కిలోల వరకు తరుగు తీస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

జవాబు : ఈ సారి వర్షాభావ పరిస్థితులతో వరి పంటకు తెగులు సోకి తాలు శాతం పెరిగింది. అందుకే రైతుల వద్ద క్వింటాకు రెండు నుంచి మూడు కిలోల వరకే తరుగు తీయాలని మిల్లర్లకు చెప్పాం. మిల్లర్ల సమావేశంలోనూ కలెక్టర్‌ స్పష్టమైన సూచనలు చేశారు. వడ్లలో తాలు తొలగించే 75 క్లీనర్లను జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చాం. రైతులు ఉపయోగించుకోవాలి. అన్నదాతలను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని