logo

నువ్వా.. నేనా?

కొడంగల్‌ నియోజకవర్గం రాష్ట్రానికి చివరిది. కర్ణాటకలో ఉండే ఈ  ప్రాంతం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది.

Updated : 03 Nov 2023 08:29 IST

రసవత్తర పోరుకు వేదిక కొడంగల్‌

న్యూస్‌టుడే-కోస్గి: కొడంగల్‌ నియోజకవర్గం రాష్ట్రానికి చివరిది. కర్ణాటకలో ఉండే ఈ  ప్రాంతం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల విభజన జరిగిన ప్రతిసారీ ఈ ప్రాంతంపై ప్రభావం చూపింది. మొదట కర్ణాటక, తరువాత ఆంధ్రప్రదేశ్‌, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలు, అలాగే మొదట్లో గుల్బర్గా, తరువాత మహబూబ్‌నగర్‌, ఇప్పుడు వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల పరిధిలోకి వచ్చింది. తొలినాళ్లలో ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఎక్కువ కాలం గడి (గుర్నాథ్‌రెడ్డి ఇంటి చుట్టూ కోట బురుజులు ఉంటాయి), గుడి (నందారం వెంకటయ్య తండ్రి గుడికట్టారు) మధ్యనే పోరు కొనసాగింది. అందుకే గడి, గుడి పోరుగా ఈ ప్రాంతంలో మాట్లాడుకునేవారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1996లో ఒక్కసారి ఉప ఎన్నిక జరిగింది. 1957లో అచ్యుతారెడ్డి మినహా ఈ ప్రాంతంలో గెలిచిన వారెవరికీ మంత్రి పదవి లభించలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ వరుసగా మూడుసార్లు గెలవలేదు.

1952

ద్విసభ్య నియోజకవర్గంలో ఒకటి జనరల్‌, మరొకటి ఎస్సీ స్థానంగా ఉంది. జాన్‌గోపాల్‌(ఆర్‌పీఐ)పై అనంతరెడ్డి(కాంగ్రెస్‌) విజయం సాధించారు. మరో స్థానంలో వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1957లో కాంగ్రెస్‌ అభ్యర్థి అచ్యుతారెడ్డి పీడీఎఫ్‌ అభ్యర్థి విఠల్‌రావుపై గెలుపొందారు.

1962

అచ్యుతారెడ్డి(కాంగ్రెస్‌)పై స్వతంత్ర అభ్యర్థి రుక్మారెడ్డి విజయం సాధించారు. బొంరాస్‌పేట మండలం రేగడిమైలారానికి చెందిన రుక్మారెడ్డి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి నియోజకవర్గంలో తొలి స్వతంత్ర ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచారు. మరో స్థానంలో ఇల్లరి బసప్ప(కాంగ్రెస్‌)పై స్వతంత్ర అభ్యర్థి జీఎన్‌ రావుపై విజయం సాధించారు.

1967

అచ్యుతారెడ్డి (కాంగ్రెస్‌) స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డిపై 8985 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మూడుసార్లు పోటీపడి రెండుసార్లు గెలిచారు.

1972

దౌల్తాబాద్‌ మండలం నందారం గ్రామానికి చెందిన నందారం మిడిదొగొడ్డి వెంకటయ్య(స్వతంత్ర), కె.శ్రీనివాసరెడ్డి(స్వతంత్ర)పై 1813 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయన తండ్రి నర్సిములు కొడంగల్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు తిరుమల మాదిరి పూజాకార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.

1978

కొడంగల్‌ మండలం రావులపల్లికి చెందిన గుర్నాథ్‌రెడ్డి(స్వతంత్ర) తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. చినవీరన్న(కాంగ్రెస్‌ ఐ)పై 3723 ఓట్ల తేడాతో గెలుపొందారు.

1983

రెండోసారి ఇందిర కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన గుర్నాథ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి నందారం వెంకటయ్యపై 3364 ఓట్ల తేడాతో విజయం పొందారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అన్న కిష్టప్ప(తెదేపా) పోటీలో నిలిచారు. హోరాహోరీ పోరులో గుర్నాథ్‌రెడ్డిది పైచేయి అయ్యింది.

1985

ఎన్టీఆర్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనలో నందారం వెంకటయ్య తెదేపాలో చేరారు. ఆ ప్రభంజనంలో ఆయన 10802 ఓట్ల మెజారిటీతో గుర్నాథ్‌రెడ్డిపై విజయం సాధించారు.

1989

గుర్నాథ్‌రెడ్డి(కాంగ్రెస్‌) నుంచి పోటీపడగా, వెంకటయ్యను కాదని తెదేపా రతన్‌లాల్‌ లాహోటీని రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో గుర్నాథ్‌రెడ్డి ఏకంగా 20,585 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.

1994-99

ఎన్నికల్లో వెంకటయ్య(తెదేపా), గుర్నాథ్‌రెడ్డి(కాంగ్రెస్‌) తలపడగా నందారం వెంకటయ్య 16,443 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యే వెంకటయ్య అనారోగ్యంతో మృతిచెందగా 1996లో ఉప ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే కుమారుడు నందారం సూర్యనారాయణకు తెలుగుదేశం టిక్కెట్టు ఇచ్చింది. కాంగ్రెస్‌ నుంచి గుర్నాథ్‌రెడ్డి పోటీపడ్డారు. నువ్వా,నేనా అన్నట్టు సాగిన ఈ ఎన్నికల్లో అధికార తెదేపా తన యంత్రాంగాన్ని మొత్తం నియోజకవర్గంలో మోహరించింది. చివరకు పార్టీ అభ్యర్థి సూర్యనారాయణ 6664 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1999లో గుర్నాథ్‌రెడ్డి(కాంగ్రెస్‌)తో అప్పటి జడ్పీటీసీ సభ్యురాలు దిడ్డి శారద(తెదేపా) తలపడగా 13,702 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుపొందింది.

2004

కాంగ్రెస్‌ నుంచి గుర్నాథ్‌రెడ్డి పోటీపడ్డారు. తితిదే సభ్యుడిగా కొనసాగిన నందారం సూర్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన సతీమణి అనూరాధకు తెదేపా బీఫాం అందించింది. ఈ ఎన్నికలో గుర్నాథ్‌రెడ్డి 5941 మెజారిటీతో అయిదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2009

ఈ ఎన్నికల్లో తెదేపా అనూహ్యంగా రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించింది. ఎన్నికలకు కేవలం 15 రోజుల సమయంలో ఆయన కొడంగల్‌ తెదేపా అభ్యర్థిగా వచ్చారు. తన పదునైన ప్రసంగంతో ఈ ప్రాంత వాసులను ఆకట్టుకున్నారు. 6976 ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి గుర్నాథరెడ్డిని ఓడించారు. అప్పట్లో ఈ విజయం చర్చకు దారితీసింది

2014

త్రిముఖ పోటీ జరిగింది. తెదేపా నుంచి రేవంత్‌రెడ్డి నిలబడగా, కాంగ్రెస్‌ పార్టీ గుర్నాథ్‌రెడ్డిని కాదని మాజీ ఎంపీ విఠల్‌రావును రంగంలోకి దింపింది. దీంతో గుర్నాథ్‌రెడ్డి తెరాస కండువా కప్పుకొని పోటీపడ్డారు. త్రిముఖ పోటీలో రేవంత్‌రెడ్డి 14614 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

2018

రేవంత్‌రెడ్డిపై పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో తెరాస ఏడాది ముందు నుంచే తమ ప్రయత్నాలు మొదలు పెట్టింది..తమ పార్టీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిని రంగంలోకి దింపింది. రాష్ట్రంలో తేదేపా ప్రభ రోజురోజుకీ తగ్గిపోవడంతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ తరఫున పోటీచేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలో తెరాస అభ్యర్థి నరేందర్‌రెడ్డి 9319 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని