logo

రాజకీయాల్లో కొలువుదీరారు!

రాజకీయాల్లోకి  ఎక్కువగా నాయకుల వారసులు,  పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు,  వైద్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అరుదనే చెప్పాలి.

Published : 10 Nov 2023 06:19 IST

పాలమూరులో తమదైన ముద్ర వేసిన నాయకులు  

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రాజకీయాల్లోకి  ఎక్కువగా నాయకుల వారసులు,  పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు,  వైద్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అరుదనే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో మాత్రం కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మనసుల్ని గెలిచి ఎమ్మెల్యేలుగా శాసనసభలో కొలువుదీరారు. కొందరు మంత్రి పదవులనూ అలంకరించి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అలాంటి నేతలపై ఆసక్తికర కథనమిదీ.


మార్కెట్‌ శాఖ కార్యదర్శిగా పనిచేసి.. : ఎంపీ పి.రాములు స్వస్థలం కల్వకుర్తి మండలం గుండూరు. 1978లో వ్యవసాయ మార్కెట్‌ శాఖ ఉద్యోగిగా చేరిన ఆయన కొన్నాళ్లు కల్వకుర్తిలో, తర్వాత సిద్దిపేటలో కార్యదర్శిగా పనిచేశారు. తెదేపా విధానాలకు ఆకర్షితులై 1994లో ఆ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి పోటీచేసి గెలుపొందారు. 1999లో మళ్లీ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. 2009లో అచ్చంపోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు.2018లో నాగర్‌కర్నూల్‌ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.


బ్యాంకు నౌకరీకి రాజీనామా చేసి.. : వీపనగండ్ల మండలం పెద్దదగడకు చెందిన జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌ ఎస్బీహెచ్‌లో ఉద్యోగం చేసేవారు. కొలువుకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 1999లో కొల్లాపూర్‌      పోటీచేసి గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. వై.ఎస్‌., రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.  2012లో కాంగ్రెస్‌కు, మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెరాస తరఫున పోటీచేసి గెలుపొందారు. 2014లో తెరాస అభ్యర్థిగా గెలిచి కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 


గెజిటెట్‌ అధికారుల సంఘం నేతగా.. : అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌  శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా 1988లో మహబూబ్‌నగర్‌ పురపాలికలో ఉద్యోగంలో చేరారు. తర్వాత పదోన్నతులతో కమిషనర్‌ స్థాయికి చేరారు. కూకట్‌పల్లి పురపాలిక డిప్యూటీ కమిషనర్‌గా, వికారాబాద్‌, రాజేంద్రనగర్‌, ఆల్వాల్‌ పురపాలికల కమిషనర్‌గా పనిచేశారు. తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌(టీజీవో) వ్యవస్థాపక ఛైర్మన్‌గా, టీజేఏసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తేవటంలో కీలక పాత్ర పోషించారు. 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. మహబూబ్‌నగర్‌ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2018లో మరోమారు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు.


ప్రభుత్వ వైద్యుడి నుంచి..: అమ్రాబాద్‌ మండలం ఎల్మపల్లికి చెందిన డా.చిక్కుడు వంశీకృష్ణ 1997లో ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంఎస్‌ పూర్తిచేశారు. కొంతకాలం లింగాల పీహెచ్‌సీ వైద్యుడిగా సేవలందించారు. డా.వంశీకృష్ణ 1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేశారు. తెదేపా అభ్యర్థి రాములు చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాములుపై విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. మళ్లీ పోటీ చేస్తున్నారు.


ఉద్యమంలోకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. : వెల్దండకు చెందిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అధికారిగా ముంబయి, దిల్లీలో పనిచేశారు. తెలంగాణ సాధనకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2007-09 వరకు ఉమ్మడి జిల్లా తెరాస అధ్యక్షుడిగా ఉద్యమ బలోపేతానికి కృషిచేశారు. 2009లో తెరాసకు రాజీనామా చేశారు.  2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా తరఫున పోటీచేసి గెలుపొందారు. 2014లో శ్రీనివాస్‌గౌడ్‌ చేతిలో ఓడిపోయారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని