logo

మరికల్‌లో భూచోళ్లు

జిల్లాలో ప్రధాన కూడలి మరికల్‌. ఉమ్మడి పాలమూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి దాటాల్సిందే...దీంతో మరికల్‌ పట్టణ రూపురేఖలు సంతరించుకుంది.

Updated : 27 Mar 2024 05:42 IST

న్యూస్‌టుడే- నారాయణపేట న్యూటౌన్‌

జిల్లాలో ప్రధాన కూడలి మరికల్‌. ఉమ్మడి పాలమూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి దాటాల్సిందే...దీంతో మరికల్‌ పట్టణ రూపురేఖలు సంతరించుకుంది. ఇక్కడి భూములకు గిరాకీ అదేస్థాయిలో ఉంది.. దీంతో ఇక్కడ ఆక్రమణలకు తెరలేస్తోంది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాగా తాజాగా ప్రభుత్వ భూములపై కొందరి కన్నుపడింది.

సర్వే నెంబరు ఒకటిలో 30 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని తాను కొనుగోలు చేసినట్లు దస్త్రాలు చూపిస్తూ మరికల్‌ పట్టణానికే చెందిన ఓ వ్యక్తి మొదట ప్రహరీ నిర్మించారు. ఆ తర్వాత బోరు డ్రిల్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకొని పరదాల చాటున పనులు మొదలెట్టారు. ఆ వ్యక్తి చూపిస్తున్న డాక్యుమెంట్లు నకిలీవి అని, మొత్తం 30 గుంటలు ప్రభుత్వానివే అంటూ అఖిలపక్ష నాయకులు, గ్రామస్థులు వాదిస్తున్నారు. ఈ పంచాయతీ కలెక్టరు వరకు వెళ్లింది... కానీ నిర్మాణాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.

భూమి చేజారితే.. : ఈ భూమి చేజారితే గ్రామానికే చెందిన పలువురు ఇందులో తామూ కొనుగోలు చేశామంటూ ముందుకొచ్చే అవకాశం ఉంది. గతంలో పట్టణానికే చెందిన ప్రముఖుడు ఆ భూమి కొనుగోలు చేశానని, ఇందుకు సంబంధించిన దస్త్రాలు ప్రదర్శిస్తూ అందులో డబ్బా ఏర్పాటు చేశారు..సకాలంలో గుర్తించిన అప్పటి ప్రజాప్రతినిధులు రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో డబ్బాను తొలగించి 30 గుంటల చుట్టూ ఇనుప కంచె నిర్మించి బోర్డు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం కంచెతో పాటు బోర్డు మాయమైంది. గతంలో ఇక్కడ రైతుబజారు నిర్మించడానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం మారిన తరువాత ఆ ప్రతిపాదన ముందుకెళ్లలేదు.


ధర్మశాల స్థలంపైనా...

ట్టణంలో ప్రభుత్వ స్థలాలు తమవే అంటూ ఎవరికి వారు ముందుకు వస్తుండటంతో మిగిలిన స్థలాల సంరక్షణపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారిని ఆనుకొని రాయచూర్‌రోడ్డులో ధర్మశాల ఉంది. మరికల్‌కు వచ్చే కొత్త వ్యక్తులు సేద తీరేందుకు, రాత్రి వేళ బస చేసేందుకు నిర్మించారు. మరికల్‌ పట్టణంలో 1960వ దశకంలో అప్పటి పాలకులు రెండు ధర్మశాలల్ని నిర్మించారు. ఒకటి గ్రామంలోని హనుమాన్‌ ఆలయం వద్ద కాగా, మరొకటి రాయచూర్‌ రోడ్డులో నిర్మించారు. హనుమాన్‌ ఆలయం వద్ద నిర్మించిన ధర్మశాలను సత్యసాయి ఆలయంగా మార్చారు. రాయచూర్‌ రోడ్డులో ఉన్న ధర్మశాలలో మొన్నటి దాకా సంచార జాతులకు చెందిన వారు ఉండేవారు. నిర్వహణ లేకపోవడంతో ఇపుడు ఇది ముళ్లకంపచెట్లకు నిలయంగా మారింది. దీంతో ఎవరూ ఇక్కడ ఉండటం లేదు. గ్రామ పంచాయతీ దృష్టి సారించి దీని నిర్వహణ చేపట్టి సామాజిక అవసరాలకు వినియోగిస్తే బాగుంటుంది. లేదంటే ఇది కబ్జాకు గురవ్వడానికి ఎంతో సమయం పట్టదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని