logo

శుభకార్యాలకు కోడ్‌ కష్టాలు

నారాయణపేట అంటేనే బంగారం, చేనేత చీరలకు ప్రసిద్ధి.. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక, ఏపీల నుంచి  ప్రజలు వేల సంఖ్యలో కొనుగోళ్లకు వస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది.

Updated : 27 Mar 2024 05:44 IST

న్యూస్‌టుడే-(పాతబస్టాండ్‌) నారాయణపేట

నారాయణపేట అంటేనే బంగారం, చేనేత చీరలకు ప్రసిద్ధి.. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక, ఏపీల నుంచి  ప్రజలు వేల సంఖ్యలో కొనుగోళ్లకు వస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నగదు లావాదేవీలకు కష్టకాలం వచ్చింది. వస్తువుల కొనుగోలుతోపాటు ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌, బంగారం, బట్టలు కొనుగోలుకు తిప్పలు పడాల్సి వస్తోంది. సారె వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలుకు నగదు తీసుకురాడానికి భయపడుతున్నారు. ఏప్రిల్‌ 8 వరకు కొంతమేరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 9 నుంచి 28 వరకు ఎక్కువమంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఆగస్టులోనూ కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి సామగ్రిని సమకూర్చుకోడానికి సిద్ధమవుతున్నారు.  రూ.50 వేలకు మించి డబ్బు పట్టుకుంటేనే షాపింగ్‌కు వీలవుతుంది.  ఆన్‌లైన్‌ చెల్లింపులపై ఐటీ ఆంక్షలు కొనసాగుతుండటంతో మోజార్టీ వ్యాపారులు నేరుగా నగదు స్వీకరణకే మొగ్గు చూపుతున్నారు. ఫంక్షన్‌ హాల్స్‌ నిర్వాహకులు, కేటరింగ్‌ సంస్థలు, హోటళ్లు, వంట మనుషులు సైతం చెక్కులు స్వీకరించడానికీ నచ్చడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం, రూ50వేల నగదుకు మించి వెంట తీసుకెళ్తే పోలీసులు తనఖీలు చేసి సీజ్‌ చేస్తుండటంతో వధూవరుల తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌లో గతంలో కంటే ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వ్యాపారం కాస్త నెమ్మదించిందని ఓ బంగారం వర్తకుడు చెప్పారు. 40శాతం వరకు పేట వర్తకంలో టర్నోవర్‌ తగ్గిందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.


సరైన ఆధారాలను చూపించాలి..

- ఎన్‌.లింగయ్య, డీఎస్పీ నారాయణపేట.

 శుభకార్యాల వేళ నగదు వెంట తీసుకెళ్లేవారు పెళ్లి కార్డులు, ఆ నగదు ఏ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేశారు..? ఎంత డ్రా చేశారు..? ఏం కొనుగోలు చేయబోతున్నారు..? వంటి వాటికి ఆధారాలు చూపించాలి. ఆస్పత్రులకు వెళ్లేవారు పేషెంట్ కేస్‌షీట్లు వెంట తీసుకెళ్లాలి. తనిఖీల్లో లభించిన నగదుకు సరైన ఆధారాలు లేకుంటే గ్రీవెన్స్‌ కమిటీకి అందజేస్తాం. తర్వాత సరైన ఆధారాలు చూపించి నగదును రికవరీ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని