logo

కంచే చేను మేస్తోంది..!

అనాథలు, వంచనకు గురైన మహిళలు, చిన్నారులకు ఆశ్రయం కల్పించి భరోసా ఇవ్వాల్సిన కేంద్రాల్లో కొందరి తీరు ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంటోంది.

Published : 27 Mar 2024 02:40 IST

బాలభవన్‌లో బాలికలకు భద్రత కరవు
కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ

  • ఉమ్మడి జిల్లాలోని ఓ బాలసదనంలో కొన్నేళ్లుగా ఓ బాలిక ఉంటోంది. తల్లి చనిపోవడం, తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో ఆమె బాలసదనంలో ఆశ్రయం పొందింది. ఐదో తరగతి వరకు సదనంలోనే ఉంటూ ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. తర్వాత ఓ గురుకులంలో చేర్పించారు. పాఠశాలకు సెలవులివ్వడంతో బాలసదనంలోనే వచ్చి ఉంటోంది. బాలసదనం రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలోని ఓ సభ్యుడు బాలికను లైగింక వేధింపులకు గురి చేశారు. కొన్నాళ్లుగా అతడి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చివరికి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు పెట్టి ఇటీవల ఆ సభ్యుడిని రిమాండ్‌కు తరలించారు.
  • మహబూబ్‌నగర్‌లోని జిల్లా వెల్ఫేర్‌ కార్యాలయం పరిధిలోని స్టేట్‌ హోంలో గతంలో భర్తను హత్య చేసిన ఓ మహిళను తీసుకొచ్చి ఉంచారు. ఈ కేసులో ఆమె మహబూబ్‌నగర్‌ జైలులో శిక్ష అనుభవించి మూడేళ్ల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చింది. తర్వాత ఆమెను జిల్లా కేంద్రంలోని స్టేట్‌ హోంకు తరలించారు. ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతుండటంతో ఆమెను హైదరాబాద్‌లోని స్టేట్‌హోంకు తరలించారు. ఈ విషయం అప్పట్లో జిల్లా అధికారుల దృష్టికెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈనాడు, మహబూబ్‌నగర్‌: అనాథలు, వంచనకు గురైన మహిళలు, చిన్నారులకు ఆశ్రయం కల్పించి భరోసా ఇవ్వాల్సిన కేంద్రాల్లో కొందరి తీరు ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంటోంది. జిల్లా వెల్ఫేర్‌ కార్యాలయాల ఆధ్వర్యంలో పని చేయాల్సిన సదనాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో అక్కడ పని చేస్తున్న కొందరు సిబ్బంది ఆశ్రయం పొందుతున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్నిచోట్ల వారిని అసాంఘిక కార్యకలాపాలకు బలవంతం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో బాలసదనాలున్నాయి. మహబూబ్‌నగర్‌ బాలసదనంలో 20 మంది, వనపర్తి-23, నారాయణపేట-60, నాగర్‌కర్నూల్‌-40, జోగులాంబ గద్వాల-35 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరి పరిరక్షణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి.

రక్షించాల్సిన వారే..

బాల్య వివాహాలు, లైంగిక దాడులు, బాలల అక్రమ రవాణా, వేధింపులు, బాలకార్మికులు, అనాథలుగా ఉన్న 18 ఏళ్లలోపు బాలికలను గుర్తించి బాలసదనంలో ఆశ్రయం కల్పిస్తారు. ప్రతి జిల్లాలో ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలుంటాయి. ఈ కమిటీల్లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరి నుంచి ఒకరిని ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. మిగతా నలుగురు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం ప్రతి మూడేళ్లకోసారి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, సమాజసేవ చేస్తున్న వారి నుంచి ఈ కమిటీలో చోటు కల్పిస్తారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీ సభ్యులు సమాజంలో అనాథలను, వంచనకు గురైన వారిని గుర్తించి బాలసదనంలో ఉంచేందుకు నిర్ణయించి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. కానీ సమాజసేవ ముసుగులో వీరిలో కొందరు దారి తప్పుతున్నారు. మహబూబ్‌నగర్‌ ఘటనే దీనికి నిదర్శనం.  


సమీక్షలేవీ...!

ప్రతి జిల్లా కేంద్రంలో వీరి పరిరక్షణకు సమన్వయకర్తలు, సిబ్బంది కలిపి ఏడుగురు విధుల్లో ఉంటారు. ఇలాంటి ఘటనలు వీరి దృష్టికెళ్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో వనపర్తి జిల్లాలోనూ పలు ఆరోపణలొచ్చాయి. ప్రతి జిల్లాలో కలెక్టర్ల అధ్యక్షతన సమావేశం జరిగి బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న వారి భద్రతపై సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. అవి నామమాత్రంగానే మారుతున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఛైల్డ్‌ వెల్పేర్‌ కమిటీలో పైరవీలకు ఆస్కారం లేకుండా మంచి వ్యక్తులకు చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. మహబూబ్‌నగర్‌ ఘటనపై జిల్లా అధికారుల వివరణ కోసం ‘ఈనాడు’ ప్రయత్నిస్తే వారు దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని