logo

దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం

దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు.

Updated : 24 Apr 2024 06:28 IST

విద్యార్థులు, ప్రజల అవస్థలు

తాడిపర్తి నుంచి చెన్నూరుకు ఉన్న బీటీరోడ్డు

గోపాల్‌పేట, న్యూస్‌టుడే : దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. మండలకేంద్రానికి కేవలం 3కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ముందుగా గోపాల్‌పేట లేక తాడిపర్తి గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిందే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా ఈ గ్రామస్థులు మాత్రం ఆటోలను ఆశ్రయించక తప్పడంలేదు.

మండల కేంద్రానికి 3కిలోమీటర్లు : గోపాల్‌పేటకు మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నా ఇంతవరకు గ్రామస్థులకు ఎటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రావాలన్నా, వృద్ధులు, పిల్లలు పాఠశాల, కళాశాలలకు వెళ్లాలన్నా, ఇతర గ్రామాలకు, అత్యవసర పరిస్థితుల్లోనైనా మూడు కిలోమీటర్ల కాలినడక మాత్ర ఇప్పటికీ తప్పడంలేదు. గోపాల్‌పేటలోని విద్యాసంస్థలు గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉంటాయి. విద్యార్థులు ఉదయం నాలుగు, తిరిగి గ్రామానికి వెళ్లడానికి నాలుగు కిలోమీటర్లు మొత్తం 8కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించలేకపోతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు గ్రామానికి గోపాల్‌పేట, తాడిపర్తి గ్రామాలనుంచే కాకుండా బుద్దారం-చిట్యాల నుంచి ప్రత్యేక బీటీరోడ్డు ఉన్నాయి.

ఇరుకురోడ్లే కారణం

గోపాల్‌పేట బస్టాండు నుంచి చెన్నూరు గ్రామానికి వెళ్లాలంటే గోపాల్‌పేటలోని వీధులు ఇరుకుగా ఉండి బస్సులు వెళ్లలేని విధంగా ఉన్నాయి. మినీ బస్సులు మాత్రం వెళ్లడానికి అవకాశం ఉంది. గోపాల్‌పేట, వనపర్తికి చెందిన ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు రోజూ చెన్నూరుకు విద్యార్థుల కోసం గోపాల్‌పేట నుంచే వెళ్తుంటాయి. గోపాల్‌పేట వీధుల్లో ఆర్టీసీ బస్సులు వెళ్లే అవకాశాలు లేవు. గోపాల్‌పేట చేపలమార్కెట్‌ సమీపంలోని వాగులోంచి రోడ్డును గ్రామం వెలుపల ఉన్న చెన్నూరు రోడ్డుకు కలిపితే బస్సులు తిరగడానికి అవకాశం ఉంటుంది. అప్పటి మంత్రిగా ఉన్న నిరంజన్‌రెడ్డి సర్వేచేసి స్థలాన్ని నిర్ణయించండని అధికారులకు సూచించినా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి గోపాల్‌పేట, చెన్నూరు గ్రామస్థులు ఈవిషయాన్ని తీసుకెళ్లారు. లింకురోడ్డు నిర్మాణానికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.


మా పిల్లలు కూడా
- శేషిరెడ్డి, మాజీ సర్పంచి, చెన్నూరు.

గ్రామంలో 7వ తరగతి వరకే ఉంది. 8వ తరగతి చదవడానికి గోపాల్‌పేట, వనపర్తికి వెళ్లాలి. ఎక్కడికి వెళ్లాలన్నా 3కిలోమీటర్ల దూరం నడవాలి. గోపాల్‌పేట పాఠశాలలో 1979లో 10వ తరగతి చదివాను. 5సంవత్సరాలు కాలినడకన ఉన్నత పాఠశాలకు వచ్చివెళ్లేవాళ్లం. మాపిల్లలకైనా బస్సు సౌకర్యం వస్తుందనుకున్నాం. వారు కూడా కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. నేటికీ గ్రామానికి బస్సు రావడంలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు