logo

విద్యుదాఘాతంతో మత్స్యకారుడి మృతి

విద్యుదాఘాతంతో మత్స్యకారుడు చనిపోయిన ఘటన నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఠాణా ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాత రాములు (65) చేపల

Published : 23 Jan 2022 04:57 IST

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో మత్స్యకారుడు చనిపోయిన ఘటన నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఠాణా ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాత రాములు (65) చేపల వేటతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో పొలం పనులు పూర్తి చేసి సమీపంలోని కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్తు తీగలు తెగి పడి ఉండగా గమనించని ఆయన వాటిని దాటి వెళ్లే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. పొద్దుపోయినా రాములు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీకి గాలిస్తుండగా కుంట వద్ద చనిపోయి కనిపించాడు. సమీపంలో విద్యుత్తు తీగలు తెగి పడి ఉన్న విషయాన్ని గుర్తించి విద్యుదాఘాతంతో చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి కుమారుడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన లైన్‌మన్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు సిద్దిపేటలో విద్యుత్తు డీఈ మహేష్‌ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేయగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.


లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

హుస్నాబాద్‌ గ్రామీణం: హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు చనిపోయారు. ఎస్‌ఐ శ్రీధర్‌,  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు...   వంగరామయ్యపల్లికి చెందిన గంగారపు చిన్న వెంకటయ్య (75) ఈ నెల 21న సాయంత్రం హుస్నాబాద్‌లో జరిగే వార సంతకు సైకిల్‌పై వెళ్తుండగా పోతారం(ఎస్‌) గ్రామం సమీపంలో ఆయన్ను లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను తొలుత హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని