logo

ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతం!

ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటింది. సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత ఉంటుంది.  ఓటు ద్వారా పాలకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈక్రమంలో జాబితాలో నమోదుకు గాను ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది.

Published : 25 Jan 2022 01:39 IST

జిల్లాలో 4.11 లక్షల మంది..
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
న్యూస్‌టుడే, మెదక్‌

ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటింది. సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత ఉంటుంది.  ఓటు ద్వారా పాలకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈక్రమంలో జాబితాలో నమోదుకు గాను ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. 18 ఏళ్లు నిండిన వారు పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో గతేడాది క్యాంపస్‌ అంబాసిడర్లను నియమించింది. జిల్లాలో మొత్తం 30 కళాశాలల్లో అంబాసిడర్లు నియామకం చేపట్టారు. ఒక్కో కళాశాలకు ఒకరిని చొప్పున నియమించారు. వీరు తమ కళాశాల పరిధిలో ఓటరు నమోదుపై చైతన్యం కల్పించారు. ప్రస్తుతం జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.

గ్రామీణుల స్ఫూర్తి..
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ఓటర్లలో చైతన్యం వెల్లివిరుస్తోంది. ఇది వరకు జరిగిన ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2018, డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. నర్సాపూర్‌ నియోజకవర్గం పోలింగ్‌ శాతం నమోదులో రాష్ట్ర స్థాయిలోనే తృతీయ స్థానంలో నిలిచింది. 2019, జనవరిలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 91.09 శాతం నమోదు కావడం గమనార్హం. లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికలు వచ్చే సరికి కొంత వరకు తగ్గింది. గతేడాది జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు పురపాలికల్లో 82కు శాతం పైగా నమోదైంది.

ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం...
కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది ఓటరు జాబితాలో నమోదుకు యాప్‌ రూపొందించింది. ‘ఓటరు హెల్ప్‌లైన్‌’ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది. ఇటీవల వెలువరించిన ఓటరు జాబితాలో 4,769 మంది కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 18-19 ఏళ్ల వయసు వారు మెదక్‌ నియోజకవర్గంలో 1,509 మంది, నర్సాపూర్‌లో 970 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి జాతీయ ఓటరు దినోత్సవాన్ని జూమ్‌ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల జిల్లాలో ఓటరు నమోదులో కీలకపాత్ర పోషించిన అంబాసిడర్లు, బీఎల్వోలను సన్మానించనున్నారు. తొలి సారి ఓటు హక్కు పొందిన వారికి కలెక్టరేట్‌లో కార్డులను పంపిణీ చేయనున్నారు.


చైతన్యపరుస్తున్నాం..
ఓటరు జాబితాలో నమోదు, అవగాహన కల్పించేందుకు ఎలక్టోరల్‌ లిటరసీ క్లబ్‌లు విసృత్తంగా పనిచేస్తున్నాయి. ప్రతి క్లబ్‌కు నోడల్‌ అధికారి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మహిళా  సంఘాలు, నిరక్షరాస్యులతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలలో అవగాహన కల్పించేందుకు ఓటరు అవగాహన ఫోరం ఏర్పాటు చేశాం. అర్హులు జాబితాలో నమోదు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.

- రాజిరెడ్డి, స్వీప్‌ అధికారి


జిల్లాలో ఇలా..
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు    
మెదక్‌ 98,120 1,05,887 2      
నర్సాపూర్‌ 1,02,350 1,04,935 6      


పోలింగ్‌ శాతం నమోదు ఇలా...
ఎన్నికలు శాతం
లోక్‌సభ 71.56
శాసనసభ 86
పురపాలిక 82.12
ప్రాదేశిక   78.46
పంచాయతీ 91.09


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని