logo

చేపల వేటకు వెళ్లి ఇద్దరి మృతి

నీటి కుంటలో విద్యుత్తు షాక్‌ పెట్టి చేపలు పట్టేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు..

Published : 04 Oct 2022 02:56 IST

కనకయ్య                           తుమ్మల అశోక్‌

న్యూస్‌టుడే - మద్దూరు, వర్గల్‌: నీటి కుంటలో విద్యుత్తు షాక్‌ పెట్టి చేపలు పట్టేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లపు కనకయ్య(45) వ్యవసాయం చేస్తుంటాడు. తన మిత్రులు నలుగురితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కనకయ్య చేపల కోసం పెట్టిన విద్యుత్తు షాక్‌ కొట్టి మృతి చెందాడని.. రాగికుంట వాగు వద్ద ఉందని మిత్రుడు మాధవరెడ్డి.. గ్రామ సర్పంచి రవీందర్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడ సర్పంచి, గ్రామస్థులు, పోలీసులు వెళ్లి వెతకగా ఆధారాలు కనిపించలేదు. కుంటకు దూరంగా ఖాళీ స్థలంలో కనకయ్య మృతదేహం ఉంది. మిత్రులు నలుగురు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి పరారయ్యారు. తండ్రి రోశయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య పుష్ప, కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. మరో ఘటనలో.. చేపలు పట్టేందుకు వెళ్లిన కూలీ నీటి కుంటలో పడి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలోని అనంతగిరిపల్లిలో జరిగింది. గౌరారం ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తుమ్మల అశోక్‌ (40) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారడు. భార్య, 18 ఏళ్ల లోపు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లొస్తానని చెప్పాడు. ఆదివారం తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం వేలూరు గ్రామ శివారులోని కిందికుంట వద్ద అనుమానాస్పద ఆధారాలున్నాయి. కుంటలో దిగి గాలించగా అశోక్‌ మృతదేహం లభ్యమైంది. భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని