logo

విజయ స్ఫూర్తి.. దశదిశలా ప్రగతి!

విజయానికి ప్రతీక.. దసరా. చెడుపై మంచి పైచేయి సాధించిన రోజు. ఎన్నో అంతరార్థాలు ఈ పండుగలో దాగి ఉన్నాయి. జగన్మాత స్ఫూర్తిగా.. నవ సమాజ నిర్మాణానికి ఈ వేడుకలు అద్దం పడుతుంటాయి.

Published : 05 Oct 2022 00:59 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట

విజయానికి ప్రతీక.. దసరా. చెడుపై మంచి పైచేయి సాధించిన రోజు. ఎన్నో అంతరార్థాలు ఈ పండుగలో దాగి ఉన్నాయి. జగన్మాత స్ఫూర్తిగా.. నవ సమాజ నిర్మాణానికి ఈ వేడుకలు అద్దం పడుతుంటాయి. ఇదే తరుణంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకతను చెబుతాయి. సత్‌ ప్రవర్తన.. ప్రకృతి పరిరక్షణ.. ఇలా ఎన్నో అంశాలపై స్వచ్ఛందంగా ప్రతిన బూనాల్సిన ప్రాధాన్యతను చాటుతాయి. పాలకులు తమ ప్రాంత అభివృద్ధిలో ఆదర్శ పథాన్ని జపించాల్సిన తీరును స్పష్టం చేస్తాయి. నేడు విజయదశమి సందర్భంగా జిల్లా కీలక రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న వైనంపై కథనం..

ప్రకృతితో మనం..
మానవ మనుగడ సవ్యంగా సాగాలంటే ప్రకృతిలో మమేకమవ్వాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణకు సమష్టిగా ముందడుగు వేయాలి. క్యాన్సర్‌ మహమ్మారిని పారదోలాలంటే ప్లాస్టిక్‌ను అంతమొందించాల్సి ఉంది. సిద్దిపేట మున్సిపాలిటీ ఆ దిశగా ముందుకు సాగుతోంది. పలు వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పచ్చదనం విశేషంగా ఆకట్టుకుంటోంది. మొక్క లేదా చెట్టును తొలగించినా జరిమానా విధిస్తున్నారు. ప్రతి బల్దియా, గ్రామం ఈ స్ఫూర్తి అందిపుచ్చుకోవాల్సి ఉంది.  

పురపాలికలు: 5


వైద్య హబ్‌గా..

జిల్లా వైద్యరంగంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. డయాగ్నోస్టిక్‌ హబ్‌, రేడియాలజీ విభాగం, డయాలసిస్‌, వెల్‌నెస్‌ కేంద్రాలు ప్రత్యేకత చాటుతున్నాయి. ఏడు బస్తీ దవాఖానాలు మంజూరవగా.. సిద్దిపేటలో ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గరిష్ఠంగా 69 శాతం మేర కాన్పులు జరుగుతుండటం విశేషం. సిద్దిపేటకు కొత్తగా పాలియేటివ్‌ కేంద్రం మంజూరైన విషయం తెలిసిందే.

మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు (వివిధ స్థాయిలు): 250 * రోజూ వైద్యసేవలు పొందుతున్న వారు: 4 వేలు


ఆమెనే ఓ శక్తి.. యుక్తిగా..

శరన్నవరాత్రి ఉత్సవాలు.. మహిళా ‘శక్తి’కి నిదర్శనంగా నిలుస్తాయి. జిల్లా ప్రగతిలో మహిళల భాగస్వామ్యం అసాధారణమైంది. అధికారిణులు, ఉద్యోగినులు, ప్రజాప్రతినిధులుగా తమ పంథాను కొనసాగిస్తున్నారు. సంఖ్యాపరంగా జనాభాలో పురుషులను మించి ఉన్నారు. వారికి బాసటగా వివిధ సందర్భాల్లో జిల్లాలో సఖి, మహిళా పోలీసు ఠాణా, భరోసా, షీ బృందాలు అండగా నిలుస్తున్నాయి. ద్విగుణీకృతమైన ఈశక్తిని పుణికిపుచ్చుకుంటే ప్రజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది.

* మొత్తం మహిళలు: 5,07,924 * ప్రజాప్రతినిధులు: 474 * కార్మికులు:  10 వేలు
* స్వయం సహాయ సంఘాలు - 18,246 * సభ్యులు - 1,93,987


చదువుల కోవెలగా..

వివిధ విద్యాసంస్థలు 1300కి పైగా ఉన్నాయి. వాటిల్లో 1.50 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. రూమ్‌ టు రీడ్‌ కార్యక్రమంలో భాగంగా 56 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. ఎన్‌ఐఐటీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఐబీఎం స్టెమ్‌ కార్యక్రమంలో భాగంగా 34 పాఠశాలల్లో 8, 9 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందిస్తున్నారు. 10 పాఠశాలల్లో రోబోటిక్స్‌ ఇన్‌ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల గురుకులాలు 36 ఉండగా.. ఇటీవల జిల్లాకు బీసీ సంక్షేమ బాలురు గురుకులం మంజూరైంది. చిన్నకోడూరు మండలం రామంచ వద్ద బీఫార్మసీ కళాశాల ఏర్పాటుకు ముందడుగు పడింది.

ప్రభుత్వ పాఠశాలలు - 1013 * విద్యార్థులు - 96,231

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని