logo

కొలువు బరి..యువ గురి

ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ప్రకటనలు జారీ చేస్తుంటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, తాజాగా గ్రూప్‌-4 ప్రకటన విడుదలైంది.

Published : 03 Dec 2022 01:23 IST

గ్రూప్‌-4లో శిక్షణకు చర్యలు
న్యూస్‌టుడే, మెదక్‌

ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ప్రకటనలు జారీ చేస్తుంటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, తాజాగా గ్రూప్‌-4 ప్రకటన విడుదలైంది. సదరు ప్రక్రియ పూర్తయితే జిల్లాలోని ఆయా శాఖల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రధానంగా పురపాలిక శాఖలో ఖాళీలు భారీగా ఉండటంతో ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి. ఇప్పటికే వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పూనుకుంది. గత మార్చిలో 80 వేల కొలువులకు ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. అందులో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,149 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పోలీసు శాఖ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా, కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, గ్రూప్‌-1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. చాలా ఏళ్ల తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు.

పురపాలికల్లో అత్యధికం..

ప్రస్తుత ప్రకటనలో పురపాలక శాఖలో అత్యధికంగా ఖాళీలున్నాయి. 2,701 పోస్టులకు 1,862 వార్డు అధికారుల పోస్టులున్నాయి. వీరిని ఆయా పురపాలికల్లోని వార్డుకొకరిని నియమించనున్నారు. దీంతో పౌరసమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. జిల్లా కేంద్రం మెదక్‌లో 32 వార్డులు, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. ఈ లెక్కన 75 మంది వార్డు అధికారుల నియామకం జరగనుంది. ప్రస్తుతం వార్డు కమిటీలు ఉండగా, అవి నామమాత్రంగానే పని చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, నిధుల విడుదల వివరాలు తదితర అంశాలను వార్డు ప్రజలకు వివరించేందుకు వార్డు అధికారులు కృషి చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖలో 51, పంచాయతీరాజ్‌ శాఖలో 34, పోలీసు శాఖలో మూడు పోస్టులు జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయివి ఖాళీగా ఉన్నాయి.

ఉచితంగా..

అభ్యర్థులకు తర్ఫీదు

సర్కారు కొలువు సాధనకు కఠోరంగా శ్రమించాల్సిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో మంది ఉద్యోగాలు దొరక్క ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏళ్ల తర్వాత భర్తీ జరుగుతుండగా నిరుద్యోగులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకు తగిన శిక్షణ అవసరం. ప్రైవేటుగా శిక్షణ పొందాలంటే రూ.వేలు వెచ్చించాల్సిందే. ఆర్థికస్థోమత కారణంగా చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి వారికి జిల్లాలోని సంక్షేమ శాఖలు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. గత ఏప్రిల్‌లో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్‌-4 పరీక్షకు 68 మందికి తర్ఫీదు ఇచ్చారు. గత నెలలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్‌ విభాగం)లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం 75 మంది తరగతులకు హాజరవుతున్నారు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో శిబిరం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని