logo

నిధులొచ్చినా.. ర్లక్ష్యమే!

పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పనులు చేపట్టేందుకు నిధులొచ్చినా.. మధ్యలోనే నిలిచిపోయాయి.

Published : 30 Jan 2023 02:56 IST

జిల్లాలో ఏసీడీపీ పనుల తీరిది

దిడ్గిలో సీసీ వేయాల్సిన దారి..

న్యూస్‌టుడే, సంగారెడ్డిఅర్బన్‌, జోగిపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జిన్నారం: పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పనులు చేపట్టేందుకు నిధులొచ్చినా.. మధ్యలోనే నిలిచిపోయాయి. శాసన సభ్యులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(ఏసీడీపీ) నిధులు మంజూరు చేసింది. ఆయా నిధులతో జిల్లాలో చాలా చోట్ల పనులు చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో తట్టెడు మట్టైనా తీయలేదు. ఈ నేపథ్యంలో పనుల ప్రగతి తీరుపై కథనం.

రెండు ఆర్థిక సంవత్సరాల్లో..

* ప్రతి నియోజకవర్గానికి రూ.2.50 కోట్ల చొప్పున గతేడాది(2021-22) ఏసీడీపీ నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సూచనలు పాటించాలని నిర్దేశించారు. ఏడాది లోపు ఆయా పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యల్పంగా నాలుగు పనులను రూ.1.30 కోట్ల నిధులకు ప్రతిపాదించారు. ఒక్కచోటా పనులు ఆరంభించలేదు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ నత్తనడకన సాగుతున్నాయి.

* ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు నెలల క్రితం నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున ఏసీడీపీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 30 పనులకు రూ.1.33 కోట్లు, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి 40 పనులకు రూ.2.97 కోట్లు, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు 24 పనులకు రూ.1.20 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రతిపాదించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.

క్షేత్ర స్థాయి పరిస్థితి..

* అందోలు మండలంలో 80 పనులకు రూ.4.80 కోట్ల నిధులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గుత్తేదారు నిర్లక్ష్యం వల్ల ఎర్రారం, మన్‌సానిపల్లిలోని సీసీ రహదారులు కమ్యూనిటీ హాలు మినహా మిగతా పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది.

* నారాయణఖేడ్‌ మండలంలో 70 శాతం వివిధ సామాజిక భవనాలకు కేటాయించారు. చాలా చోట్ల పనులు ఆరంభించాల్సి ఉంది.

* పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం కానుకుంట, రాంరెడ్డిబావిలోనూ భవనాల పనుల్లో పురోగతి లేదు. జిన్నారం మండలంలో  లక్ష్మీపతిగూడెం, రాళ్లకత్వ గ్రామ పంచాయతీ నిర్మాణాల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు.

* జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం, మొగుడంపల్లి, మాచిరెడ్డిపల్లి, వెంకటాపూర్‌, పోతిరెడ్డిపల్లి, మాద్రి, దిగ్వాల్‌, లాలాకుంట, బసంత్‌పూర్‌, విట్టునాయక్‌ తండా, ఖాన్‌జామల్‌పూర్‌లో తదితర గ్రామాలు, తండాల్లో రూ.5 లక్షల చొప్పున సామాజిక భవనాలు, షాదీఖానాలు, సీసీ రహదారులకు నిధులు కేటాయించారు. ఒక్క చోటైనా పనులు చేపట్టలేదు.

అధికారులు ఏమంటున్నారంటే..

జిల్లాలో ఏసీడీపీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేస్తామని జగదీశ్వర్‌ (పీఆర్‌ఈఈ) , మనోహర్‌ (సీపీవో) పేర్కొన్నారు. త్వరలో ఇంజినీరింగ్‌ అధికారులతో సమన్వయం కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. వచ్చే మార్చి 31లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని