logo

దశ మారాలి..సంక్షేమం చేకూరాలి!

సమతుల.. సమగ్ర బడ్జెట్‌ నిజమైన అభివృద్ధిని కాంక్షిస్తుంది. అన్ని రంగాలకు సరైన ప్రాధాన్యత ప్రగతిని ప్రతిబింబిస్తుంది.

Published : 04 Feb 2023 01:49 IST

రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా వాసుల ఆశలు

న్యూస్‌టుడే, సిద్దిపేట: సమతుల.. సమగ్ర బడ్జెట్‌ నిజమైన అభివృద్ధిని కాంక్షిస్తుంది. అన్ని రంగాలకు సరైన ప్రాధాన్యత ప్రగతిని ప్రతిబింబిస్తుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా యేటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పద్దు’ రూపంలో కేటాయింపులు చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 6న శాసనసభలో ప్రవేశపెట్టనున్న తరుణంలో జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం... 9 కొత్త రెవెన్యూ మండలాల్లో సమీకృత కార్యాలయాల నిర్మాణాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. ముఖ్యమైన విభాగాల నిధుల అవసరాలు ఇలా..


‘మన బడి’కి 300 పాఠశాలలు

మన ఊరు/బస్తీ - మన బడి పథకంలో 976 పాఠశాలలకు గాను తొలి విడతగా 341ని పథకంలోకి చేర్చారు. వాటిల్లో 184 ప్రాథమిక, 33 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 55 వేల మంది చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.88.63 కోట్లు, ఉపాధి హామీ కింద రూ.40 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పటికే 36 పాఠశాలలను సిద్ధం చేయగా.. ఈ నెల 1న 25 ఆరంభమయ్యాయి. మరో 28 పాఠశాలల్లో పనులు ముగింపు దశకు చేరగా.. 200కి పైగా బడుల్లో పనులు ప్రారంభమై వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.15 కోట్లకు పైగా వెచ్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో 300 కిపైగా పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాల్సి ఉంది.


విశ్వవిద్యాలయం డిమాండ్‌

సిద్దిపేట.. ఐదు జిల్లాలతో భౌగోళికంగా అనుసంధానమై ఉంది. ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ రెండు దశాబ్దాలుగా ఉంది. రాజన్న సిరిసిల్ల, జనగామ, మెదక్‌, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి విద్యార్థులు సిద్దిపేటకు చదువుకునేందుకు తరలి వస్తుంటారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాల పెంపునకు వర్సిటీ కీలకంగా మారుతుంది.


‘వాటా’తో రైల్వే వేగం

మనోహరాబాద్‌ - కొత్తపల్లి రైలు మార్గాన్ని 151 కి.మీ లక్ష్యంతో పనులను రూ.1160.47 కోట్ల అంచనాతో ప్రారంభించారు. కొడకండ్ల వరకు 41 కి.మీ. మార్గం పూర్తయింది. గత జూన్‌లో గజ్వేల్‌ వరకు గూడ్స్‌ రైళ్ల సేవలు ఆరంభమయ్యాయి. దుద్దెడ, లకుడారం, వెలికట్ట గ్రామాల పరిధిలో పనులు కొనసాగుతున్నాయి. దుద్దెడ (కలెక్టరేట్‌ సమీపం), సిద్దిపేటలో స్టేషన్‌ పనులు చేపడుతున్నారు. రైల్వే లైన్‌ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద నిధులు ఖర్చు చేస్తోంది. మరిన్ని నిధులు మంజూరు చేయాల్సి ఉంది.


‘ట్రామా కేర్‌’ కావాలి

వైద్యరంగంలో జిల్లా నమూనాగా నిలుస్తోంది. అనేక చోట్ల ఆధునిక సదుపాయాలతో ప్రత్యేకతను చాటుతోంది. వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాగా ఆసుపత్రుల ఆధునికీకరణ, బస్తీ దవాఖానాల ఏర్పాటు, నూతన ఆసుపత్రుల నిర్మాణం జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 95 కి.మీ. మేర రాజీవ్‌ రహదారి విస్తరించి ఉంది. రోడ్డు ప్రమాదాలతో నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. ఈ తరుణంలో క్షతగాత్రులకు వెంటనే అత్యవసర వైద్య సాయం అందించడానికి గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో, సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వద్ద ఈ ప్రతిపాదన ఉన్నప్పటికి ఏళ్లుగా మోక్షం కలగడం లేదు.


ఐటీ సౌధం.. యువతకు ఊతం

ఐటీ టవర్‌

జిల్లాలో 20 భారీ, 13 మధ్య తరహా, 631 చిరు, చిన్నతరహా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. 20 వేలకు పైగా ఉపాధి పొందుతున్నారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంలో 168 పరిశ్రమలు స్థాపించి 5603 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నర్మెటలో పామాయిల్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ములుగు, దుద్దెడలో టీఎస్‌ఐఐసీ భూములను సమీకరించింది. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నిధులు అవసరం. ఐటీ కొలువు దక్కేలా 2020లో నాగులబండ వద్ద నిర్మిస్తున్న ఐటీ సౌధం తుది దశకు చేరింది. సిద్దిపేటలో జేఎన్‌టీయూ లేదా ఓయూకు అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


జలాశయం.. పర్యాటకధామం

జిల్లాలో అనంతగిరి, రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌ జలాశయాలు నిర్మితమయ్యాయి. రంగనాయసాగర్‌ 9 కి.మీ. కట్టను పర్యాటక ధామంగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.125 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లకూ నిధులు రావాల్సి ఉంది. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద 8.23 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి నిర్మాణం 95 శాతం పూర్తయింది. ట్రయల్‌ రన్‌ విజయవంతంగా చేపట్టారు. రామవరం వెళ్లే రహదారిని మూసివేస్తే.. దాదాపు పూర్తయినట్లే. ముంపు బాధితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీ కింద నిధులు కేటాయించాలి. గండిపల్లి రిజర్వాయరు పునరాకృతికి రూ.400 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఏడేళ్ల నుంచి ఎలాంటి పురోగతి లేదు. ‘కాళేశ్వరం’ ప్రధాన కాల్వల నిర్మాణం దాదాపు 300 కి.మీ. మేర పూర్తయింది. వాటి పురోగతికి నిధులు కేటాయించాలి. నిర్వాసితుల కాలనీల్లో సమస్యలు తీర్చాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని