logo

శిబిరాల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: హరీశ్‌రావు

కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్‌, వైద్యసిబ్బందిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Published : 04 Feb 2023 01:49 IST

వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పాలనాధికారి, జిల్లా వైద్యాధికారి

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్‌, వైద్యసిబ్బందిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దగ్గరిచూపు కళ్లద్దాలు అవసరమయ్యే వారికి వెంటనే అందజేయాలని సూచించారు. పట్టణంలోని 43వ వార్డు బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి హాజరైన వృద్ధులు, మహిళలను శిబిరం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు చేశారని, కళ్లద్దాలు ఎంతమందికి పంపిణీ చేశారనే వివరాలను సిబ్బంది ద్వారా ఆరా తీశారు. మంత్రి వెంట మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌, సుడా ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి ఉన్నారు.

పనుల్లో వేగం పెరగాలి

సిద్దిపేట: జిల్లా సమగ్ర ప్రగతిలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ర.భ. శాఖ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి సిద్దిపేట, గజ్వేల్‌ అభివృద్ధి పనులపై సమీక్షించారు. సిద్దిపేట రింగు రోడ్డు నిర్మాణం తీరుపై ఆరా తీశారు. మార్చిలోపు పూర్తి చేయాలన్నారు. సిద్దిపేట నుంచి ఎన్సాన్‌పల్లికి రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని,  వేగిరం చేయాలన్నారు. వెటర్నరీ కళాశాల అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు ఫోన్లో సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని