logo

చదువుతో పాటు దేశాభివృద్ధికి కృషి

ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు దేశాభివృద్ధికి పాటుపడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (అభావిప) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జానారెడ్డి సూచించారు.

Published : 05 Feb 2023 02:04 IST

అభావిప రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జానారెడ్డి

మాట్లాడుతున్న జానారెడ్డి, వేదికపై శ్రీధర్‌, శ్రీనివాస్‌ తదితరులు

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు దేశాభివృద్ధికి పాటుపడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (అభావిప) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జానారెడ్డి సూచించారు. శనివారం మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు వేడుక మందిరంలో అభావిప 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక సభ్యులున్న ఏకైక విద్యార్థి సంఘం అభావిప అని పేర్కొన్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. గొప్ప చరిత్ర కలిగిన మన సంస్కృతి నాశనానికి పలు కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టే బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం ప్రపంచంలోనే పెద్దన్న పాత్రను పోషించే స్థాయికి చేరిందన్నారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుండటంతో ఓర్వలేని వారు పలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. యువత మత్తుకు బానిసలు కాకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించామని గుర్తుచేశారు. దేశం కోసం ఎంతమంది మహనీయులు ప్రాణాలను త్యాగం చేశారని, వారి స్ఫూర్తిగా ఆశయాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం 3 వేల మందితో పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర కార్య సమితి సభ్యుడు శ్రీధర్‌, మెదక్‌ విభాగ్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఉపకార వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు భానుచందర్‌, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు నవీన్‌, పట్టణాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, స్వాగత సమితి సభ్యుడు రాజశేఖర్‌, జిల్లా కన్వీనర్‌ శశికాంత్‌, రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు ఆర్తి, సమ్మేళనాల జిల్లా కన్వీనర్‌ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని