logo

సంక్షిప్త వార్తలు

సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌-4 పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇస్తామని ఆ స్టడీ సర్కిల్‌ అధ్యక్షుడు రామారావు, పరీక్షల సమన్వయ కన్వీనర్‌ కృష్ణ కుమార్‌ తెలిపారు.

Published : 06 Feb 2023 01:19 IST

అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌-4 ఉచిత శిక్షణ

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌-4 పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇస్తామని ఆ స్టడీ సర్కిల్‌ అధ్యక్షుడు రామారావు, పరీక్షల సమన్వయ కన్వీనర్‌ కృష్ణ కుమార్‌ తెలిపారు. ఆదివారం స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8 నుంచి 28వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలు, టీఎస్‌పీసీ ఓటీఆర్‌ నంబర్‌తో పాటు గ్రూప్‌-4కు దరఖాస్తు చేసుకున్న కాపీని సమర్పించాలని చెప్పారు. మార్చి 1 నుంచి 60 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో స్టడీ సర్కిల్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌, సభ్యులు నాగయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యం, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ సభ్యులు దుర్గా ప్రసాద్‌, మాజీ ఎంపీపీ అశోక్‌ పాల్గొన్నారు.


దరఖాస్తులకు 15 వరకు గడువు

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో నూతన విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి ఇంటర్‌లో మిగిలి ఉన్న ఖాళీల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త నర్సింహులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు కలపి మొత్తం 32 ఉన్నాయని, అందుల్లోని విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా బోధన, పలు రకాల సౌకర్యాలను అందజేస్తున్నామన్నారు. ఇతర పాఠ్యాంశాలతో పాటు అరబ్బీలో బోధన ఉంటుందని, నీట్‌, ఐఐటీ, జేఈఈలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15 చివరి తేదని, ఆసక్తి ఉన్న వారు ‌www.tmreis.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు చరవాణి 98491 48961లో సంప్రదించాలన్నారు.


11 నుంచి సాంకేతిక కోర్సు పరీక్షలు

మెదక్‌: టైలరింగ్‌, డ్రాయింగ్‌ సాంకేతిక కోర్సు పరీక్షను ఈ నెల 11 నుంచి 14 వరకు మెదక్‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ తెలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటాయన్నారు. అభ్యర్థులు http:///bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.


పదోతరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష: ఎస్‌ఎఫ్‌ఐ

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలుర వసతి గృహం వద్ద కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయడమే కాకుండా విద్యార్థుల్లో దాగిఉన్న పరిజ్ఞానాన్ని వెలికితీసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌, ఉపాధ్యక్షుడు జగన్‌, కార్యదర్శి సంతోష్‌, సహాయకార్యదర్శి అజయ్‌, నాయకులు విజయ్‌, కరుణాకర్‌, అరుణ్‌ పాల్గొన్నారు.


పోస్టాఫీసుల్లో ప్రత్యేక శిబిరాలు

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: పీఎం కిసాన్‌ యోజన లబ్ధిదారులకు పోస్టల్‌ ఖాతా ఉంటే.. సిబ్బంది నగదును ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే అవకాశం ఉంటుందని ఆ శాఖ సూపరింటెండెంట్‌ వీఎల్‌ఎన్‌ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 14,600 రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు వారి ఖాతాల్లో జమ కావడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. వెంటనే వారందరూ ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ ఖాతా తెరవాలని కోరారు. ఇందు కోసం ఈ నెల 15 నుంచి జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని కిసాన్‌ సమ్మాన్‌ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని