logo

అనధికార కోతలు.. రైతుకు వ్యథలు

జిల్లాలో అనధికార విద్యుత్తు కోతలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగిలో రైతులు పంటలు వేశారు.

Published : 09 Feb 2023 01:59 IST

రోడెక్కి నిరసన తెలుపుతున్న వైనం
న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌, నంగునూరు, చేర్యాల, బెజ్జంకి, కోహెడ

విద్యుత్తు కోసం చేర్యాలలో పొలం గట్టుపైనే నిద్రిస్తున్న రైతు

జిల్లాలో అనధికార విద్యుత్తు కోతలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగిలో రైతులు పంటలు వేశారు. తీరా అనధికారికంగా కోతలు పెడుతుండటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నాలుగైదు రోజులుగా సరఫరాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రసుత్తం రాత్రి 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అధిక లోడు కారణంగా మధ్యలో గంట, రెండు గంటలపాటు అనధికార కోతలు విధిస్తున్నారు. గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు యథావిధిగా సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు సమస్యకు తోడు మొగిలి పురుగులతో పంటలకు నష్టం వాటిల్లనుందని రైతులు అంటున్నారు.

పెరుగుతున్న వినియోగం..

జిల్లావ్యాప్తంగా 5.25 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 1.54 లక్షలు వ్యవసాయానివే. జిల్లాలో 3 లక్షల ఎకరాలకుపైగా వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కూరగాయలు సాగు చేశారు. రోజువారీగా 7.6 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతోంది. కొన్ని రోజులుగా వాడకం ఎక్కువైంది. వ్యవసాయం, గృహ, వ్యాపార, పరిశ్రమలకూ వినియోగం ఎక్కువ కావడంతో లోడ్‌ తగ్గించేందుకు అధికారులు అనధికార కోతలు విధిస్తున్నారు. మూణ్నాలుగు రోజులుగా మధ్యాహ్నం వేళ ఇబ్బందులు తప్పడం లేదు.

అధిక నీరు అవసరం...

యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కూరగాయ పంటలకు ప్రస్తుతం అధిక నీరు అవసరమవుతోంది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు చివరి దశలో ఉన్నాయి. రెండ్రోజులుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్ర వరకు కోత విధిస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పలుచోట్ల విద్యుత్తు సరఫరా ఇలా..

* బెజ్జంకి మండలంలో 7న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6.40 వరకు, తిరిగి రాత్రి 10 నుంచి 8వ తేదీ వేకువజామున 4 గంటల వరకు, తిరిగి ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా చేశారు.
* సిద్దిపేట గ్రామీణం, నారాయణరావుపేట, నంగునూరు మండలంలో 6వ తేదీ రాత్రి 10.15 నుంచి 7వ తేదీ ఉదయం 11.20 గంటల వరకు, తిరిగి రాత్రి 10.15 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నిరంతరాయంగా వ్యవసాయానికి సరఫరా చేశారు.
* కోహెడ మండలంలో ఈనెల 6న రాత్రి 10 గంటల నుంచి 7న ఉదయం 5 వరకు, తిరిగి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 8న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా చేశారు.


సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రంలో సమస్య..

- మహేష్‌కుమార్‌, ఇన్‌ఛార్జి ఎస్‌ఈ సిద్దిపేట

సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు జనరేటర్లలో సాంకేతిక సమస్య ఉత్పన్నమవడంతో సరఫరా నిలిచిపోయింది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో జిల్లాలో వ్యవసాయానికి రెండ్రోజులుగా రాత్రి 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా చేశాం. మిగిలిన సమయంలో కోత విధించాం. గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు యథావిధిగా విద్యుత్తు సరఫరా అవుతోంది. సింగరేణిలో నెలకొన్న సమస్య పరిష్కారమైతే సరఫరాను పునరుద్ధరిస్తాం.
కనీసం 9 గంటలు ఇవ్వాలి..
- కిష్టయ్య, చుంచనకోట చేర్యాల మండలం
మూడెకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుతం నీటి తడులు సరిగానే అందుతున్నాయి. గతంలో రాత్రి, పగలు కలుపుకొని 9 గంటలపాటు త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా అయ్యేది. రెండ్రోజులుగా పగలు అడపాదడపా గంట మాత్రమే కరెంటు వస్తోంది. రాత్రివేళ 5 గంటలు ఇస్తున్నారు. నీటి తడులు సరిగా అందక పొలం ఆరిపోతోంది. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో పాతిక శాతం పొలం నెర్రెలువారుతుంది. రోజుకు కనీసం 9 గంటలు సరఫరా చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని