logo

కొరవడిన నిర్వహణ.. నీటికి వేదన

ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పరిష్కారం చూపింది. ఇందుకోసం ప్రతి గ్రామంలో ట్యాంకు నిర్మించి, పైప్‌లైన్‌ వేసి, కుళాయిలను బిగించారు.

Published : 24 Mar 2023 01:14 IST

పల్లెల్లో ఇదీ తీరు
- న్యూస్‌టుడే, మెదక్‌, నర్సాపూర్‌, పాపన్నపేట, అల్లాదుర్గం, రేగోడ్‌

ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పరిష్కారం చూపింది. ఇందుకోసం ప్రతి గ్రామంలో ట్యాంకు నిర్మించి, పైప్‌లైన్‌ వేసి, కుళాయిలను బిగించారు. అయినా ఇంకా పల్లెల్లో ఎద్దడి నెలకొంది. లీకేజీలతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలో ఎదురవుతున్న ఇబ్బందులను ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలు ఇలా..  

జిల్లాకు సింగూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం పెద్దారెడ్డిపేట వద్ద మిషన్‌ భగీరథలో రూ.857.42 కోట్లు వెచ్చించి, ఫిల్టర్‌బెడ్‌ నిర్మించారు. అయితే తరుచూ సాంకేతిక సమస్యలతో  తలెత్తుతున్నాయి. చక్రియాల ఇన్‌టెక్‌వెల్‌ వద్ద విద్యుత్తు సమస్యతో నర్సాపూర్‌ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు రెండూ, మూడు రోజుల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు.

ట్యాంకు నిరుపయోగం : నర్సాపూర్‌ మండలం జగ్యాతండాలో ట్యాంకు వృథాగా ఉంది. దీనిని వినియోగంలోకి తీసుకువస్తే విద్యుత్తు, సాంకేతిక సమస్యలు తలెత్తితే వినియోగించుకోవచ్చు. దీని పక్కనే ఉన్న బోరు నుంచి ట్యాంకుకు కనెక్షన్‌ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. మంజీరా సరఫరా నిలిచిపోయినప్పుడు వ్యవసాయ బోర్లే దిక్కవుతున్నాయి.

మరమ్మతుకు నోచక : శివ్వంపేట మండలం నానుతండాకు సాంకేతిక కారణాలతో మంజీరా నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న మూడు బోర్లే ఆధారమయ్యాయి. అయితే వీటిలో రెండు పనిచేయడంలేదు. కొల్చారం, కౌడిపల్లి, వెల్దుర్తి మండలాల్లో మంజీరా నీటి సరఫరా లేని సమయాల్లో అవస్థలు తప్పడంలేదు. ఈ విషయమై డీఈఈ కిషన్‌ మాట్లాడుతూ.. మంజీరా సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. టేక్మాల్‌ మండలం వెంకటాపూర్‌లో ఒకే ట్యాంకు ద్వారా సరఫరా చేయడంతో సరిపోవడం లేదు. గతంలో నిర్మించిన ట్యాంకు ఉపయోగంలో లేదు. మరమ్మతు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

పగిలిన పైపులైన్లు : పాపన్నపేట మండలం డాక్య, రాజ్య, అమ్రియా తండాలకు నీటి సరఫరా కావడంలేదు. అధికారులకు విన్నవించినా, స్పందించడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పాపన్నపేట, కొడపాక, కొత్తపల్లి గ్రామాల్లోని పలు కాలనీల్లో  సరిపోను రావడంలేదని వాపోతున్నారు. కొన్ని చోట్ల పైపులైన్లు పగిలాయి. మరమ్మతు చేపట్టడంలేదు.

రేగోడ్‌ మండలం పోచారంలో సరఫరా అయిన కలుషిత నీరు


అల్లాదుర్గం మండలం రాంపూర్‌లో లీకేజీ

బోర్లే దిక్కు : అల్లాదుర్గం మండలం రాంపూర్‌ శివారు పెద్దమ్మ ఆలయ సమీపంలో పైపులు లీకై నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో  కలుషితమవుతున్నాయి. మండలంలోని వెంకటారావుపేట్‌లో బోరు బావుల వద్దకు వెళ్తున్నారు. పెద్దశంకరంపేట తిరుమలపురం కాలనీ, అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద ఇదే పరిస్థితి. రేగోడ్‌ మండలం పోచారంలోనూ పదిహేనురోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.


ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం

సింగూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిసరఫరా అవుతోంది. కలుషితమయ్యేందుకు ఆస్కారం లేదు. సమస్యలున్నా, లీకేజీ గురించి తెలిసినా వెంటనే పరిష్కరిస్తున్నాం. చక్రియాల్‌ ఉపకేంద్రం నుంచి పరిశ్రమలకు కనెక్షన్లు ఉండడం వల్ల లోడు పెరిగి విద్యుత్తు నిలిచిపోతోంది. ప్రత్యేక హెచ్‌టీ లైన్‌ వేయనున్నాం.

దినేశ్‌, కిషన్‌, డీఈఈలు, మిషన్‌ భగీరథ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని