logo

చకచకా నిర్మాణం.. ప్రమాదాలు దూరం

జాతీయ రహదారిపై బైపాస్‌ వలయం.. రయ్‌మంటూ దూసుకొచ్చే వాహనాలు.. రెప్పపాటులో ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోవడం.. ఇలా నెలలో ఐదారు ప్రమాదాలు జరిగేవి.

Published : 07 Jun 2023 01:34 IST

న్యూస్‌టుడే, చేగుంట

ఆరు వరుసలుగా జాతీయ రహదారి నిర్మాణం

జాతీయ రహదారిపై బైపాస్‌ వలయం.. రయ్‌మంటూ దూసుకొచ్చే వాహనాలు.. రెప్పపాటులో ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోవడం.. ఇలా నెలలో ఐదారు ప్రమాదాలు జరిగేవి. ఇది 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి బైపాస్‌ సర్కిల్‌ వద్ద పరిస్థితి. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడ ఉపరితల వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న అతిపొడవైన 44వ జాతీయ రహదారి జిల్లాలోని చేగుంట, తూప్రాన్‌ మీదుగా వెళ్తుంది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ దారిలో వేగంగా వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. స్పీడ్‌గన్లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే. ముఖ్యంగా రెడ్డిపల్లి సర్కిల్‌ వద్ద ఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి. ఇటు హైదరాబాద్‌, అటు నాగపూర్‌ నుంచి వచ్చే వాహనాలు సమీపంలోకి వచ్చే వరకు బైపాస్‌ సర్కిల్‌ కనిపించకుండా ఉండటంతో డ్రైవర్లు తికమకపడేవారు. ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం.

రూ.19 కోట్లతో..

రెడ్డిపల్లి వద్ద ప్రమాదాల నివారణకు ఉపరితల వంతెన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.19 కోట్లు మంజూరు చేసింది. వీటితో గతేడాది నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. ఇరువైపులా మట్టి వేస్తూ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ ఆరు వరుసలుగా నిర్మిస్తున్నారు. మరో ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికతో సాగుతున్నారు.

తగ్గిన వంతెన ఎత్తు

వాస్తవానికి వంతెన ఎత్తు 18 అడుగులు ఉండాలి. ఇక్కడ మాత్రం 13 అడుగులు మాత్రమే ఉంది. అందులో నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగించడం కష్టంగా ఉంటుంది. కేవలం బస్సులు, లారీలు మాత్రమే వెళ్లేందుకు ఆస్కారం ఉంది. తూప్రాన్‌ మండలం నాగులపల్లి వద్ద వంతెన ఎత్తు 18 అడుగులు ఉంది. నాగపూర్‌ వైపు నుంచి చేగుంటకు భారీ వాహనాలు రావాలంటే కుదరదు. ఈ విషయమై స్థానికులు విన్నవిస్తున్నా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిజామాబాద్‌ నుంచి చేగుంటలోకి వాహనాలు మలుపు తిరిగే చోట సర్వీసు రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇలా కొన్ని సవరణలు చేస్తూ నిర్మాణం చేపడితే ప్రయాణం సాఫీగా సాగిపోనుంది. దీనిపై సంబంధిత అధికారులు దృష్టిసారించాలి.

చేగుంట వద్ద నిర్మిస్తున్న వంతెన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని