logo

స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!

లోక్‌సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్‌ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్‌ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు.

Published : 10 May 2024 01:27 IST

న్యూస్‌టుడే, చేగుంట: లోక్‌సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్‌ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్‌ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. ముఖ్యమైన కేంద్రస్థానం ఎంపిక చేసుకొని రోడ్డుషో, కార్నర్‌ మీటింగ్‌లను ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో, కాలనీలు, బస్తీల్లో ప్రచారమంతా స్థానిక నాయకుల భుజస్కంధాలపై ఆధారపడి ఉంది. మండల స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తామే అభ్యర్థులం అన్నంతగా బాధ్యత భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. మెదక్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాస, భాజపాలకు చెందిన నాయకులు తమ పార్టీ అభ్యర్థులకు గ్రామ స్థాయిలో అధిక ఓట్లు వచ్చేలా, పరపతి రుజువు పర్చుకునేలా నిరంతరం కృషి చేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాలు పంచడం, దుకాణాల్లోనూ తమ పార్టీ, అభ్యర్థులు ఇస్తున్న హామీలను వివరించడం చేస్తున్నారు. మెదక్‌లో కాంగ్రెస్‌ నుంచి నీలం మధు, భారాస తరఫున వెంకట్రామిరెడ్డి, భాజపా అభ్యర్థిగా మాధవనేని రఘునందన్‌రావు నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల రోడ్డుషో, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటున్నారు. మండలాల్లో మాత్రం కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ప్రచారంలో ఉంటున్నారు. ఓటర్లకు పార్టీ అభ్యర్థి పేరు, గుర్తు, పొటో తెలిసేలా నమూనా ఈవీఎంలను వెంటేసుకొని అవగాహన కల్పిస్తున్నారు. గ్రామానికి రెండేసి నమూనా ఈవీఎంలను పార్టీలు సరఫరా చేశాయి. రాబోయే సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు.. అనుచరులతో కలిసి ఇప్పటినుంచే ప్రాక్టీస్‌ మాదిరి సందడిగా ఊళ్లు, గల్లీలు తిరుగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు