logo

బీడుభూముల్లో.. సాగునీళ్లు!

బీడుభూములకు సాగునీళ్లిచ్చేలా సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. జహీరాబాద్‌, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధి 11 మండలాలు, 231 గ్రామాలకు దీని ద్వారా ప్రయోజనం దక్కనుంది.

Published : 07 Jun 2023 01:34 IST

సంగమేశ్వర ఎత్తిపోతల నిర్మాణ పనులకు శ్రీకారం
నేడు భూమిపూజ చేయనున్న మంత్రి హరీశ్‌రావు

ఏర్పాట్ల గురించి తెలుసుకుంటున్న అదనపు పాలనాధికారి వీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

ఈనాడు, సంగారెడ్డి: బీడుభూములకు సాగునీళ్లిచ్చేలా సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. జహీరాబాద్‌, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధి 11 మండలాలు, 231 గ్రామాలకు దీని ద్వారా ప్రయోజనం దక్కనుంది. 2.19 లక్షల ఎకరాలకు  అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం దీని ద్వారా ఎక్కువగా లబ్ధి పొందనుంది. దీని పరిధిలోని అయిదు మండలాల్లో 115 గ్రామాల్లోని 1.03లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. అందోలులోని రెండు మండలాల్లోని 66 గ్రామాల పరిధిలో 65,816 ఎకరాలకు, సంగారెడ్డి పరిధి నాలుగు మండలాల్లో 50గ్రామాల్లోని 49,925 ఎకరాలకు అందేలా పనులు చేయనున్నారు. ఈనెల 7న మంత్రి హరీశ్‌రావు మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడ వద్ద నిర్మించిన పంపుహౌజ్‌ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. మరో పంపుహౌజ్‌ను జహీరాబాద్‌ మండలంలోని హోతి(కె) గ్రామంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.2,653 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెడుతున్నారు. సాగునీటి దినోత్సవం సందర్భంగా నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత మంత్రి హరీశ్‌రావు అక్కడే ఏర్పాటు చేసే బహిరంగసభలో మాట్లాడనున్నారు. ఇప్పటికే అధికారులు ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 6న అదనపు పాలనాధికారి వీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, నీటిపారుదల శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు.

గోదావరి జలాలను సింగూరులో నింపి: కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌ -6 ద్వారా కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయం నుంచి 12టీఎంసీల నీటిని సింగూరులో ఎత్తిపోస్తారు. దీనిని సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా మూడు నియోజకవర్గాలకు మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టుకోసం 113మెగావాట్ల విద్యుత్తు వినియోగించాల్సి ఉంటుందని అంచనా. పంపుహౌజ్‌లు మొదలు కాలువల నిర్మాణానికి 6,727 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి సాగుకు నీళ్లివ్వాలనేది లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని