logo

రైతుల ఆర్థిక బలోపేతానికి దోహదం

నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆయిల్‌పామ్‌ కర్మాగారంతో ఈ ప్రాంత రైతుల ఆర్థిక బలోపేతానికి ఎంతో దోహదం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 01 Oct 2023 01:49 IST

ఆయిల్‌పామ్‌ కర్మాగారం భూమి పూజలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు

భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖాగోయల్‌, మంత్రి హరీశ్‌రావు, డీజీపీ అంజనీకుమార్‌, వంటేరు ప్రతాప్‌రెడ్డి,    రోజాశర్మ, పోలీసు కమిషనర్‌ శ్వేత తదితరులు

సిద్దిపేట, నంగునూరు, సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆయిల్‌పామ్‌ కర్మాగారంతో ఈ ప్రాంత రైతుల ఆర్థిక బలోపేతానికి ఎంతో దోహదం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించనున్న ఆయిల్‌పామ్‌ కర్మాగారానికి శనివారం భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు పట్ల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎంతో సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులతో ఆయిల్‌ఫెడ్‌, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని పాలనాధికారిని కోరారు. ఏడాదిలోపు పరిశ్రమను అందుబాటులోకి తెస్తామన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో ఆకలిచావులు

50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు, బీడుబడ్డ భూములు, నెర్రవారిన పొలాలు దర్శనమిచ్చాయని మంత్రి అన్నారు. వారి పాలనలో గాలిలో దీపంలా కరెంటు ఉంటే నేడు సీఎం కేసీఆర్‌ కడుపు నిండా కరెంటు ఇస్తూ రైతుకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఉచితం కరెంట్‌ ద్వారా 24 లక్షల పంపుసెట్టు నడుస్తున్నాయన్నారు. ఉద్యాన శాఖ కమిషనర్‌ హనుమంతరావు మాట్లాడుతూ.. దేశానికి దిక్చూచి తెలంగాణ అయితే తెలంగాణకు దిక్చూచి సిద్దిపేట అన్నారు. ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ కర్మాగారంతో 6 జిల్లాల రైతులకు మేలు జరగనుందన్నారు. ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌ జన్మదిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావును సభలో కలిసి ఆశీర్వాదం తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఆయిల్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సురేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌, జడ్పీటీసీ సభ్యురాలు తడిసిన ఉమ, ఆయిల్‌పామ్‌ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సిద్దిపేటలో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం, గురుపూజోత్సవం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. సిద్దిపేటలో ప్రైవేటు ఉపాధ్యాయులకు తనవంతుగా ఉచితంగా రూ.5 లక్షల బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు. 3200 మందికి వర్తింపజేసేలా రూ.8.20 లక్షల విలువైన చెక్కును సంఘం ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిన్నా, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌, కోశాధికారి భగవాన్‌రెడ్డి,  సత్యం, రమేశ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

చాగంటి దంపతులతో హరీశ్‌రావు

వేసవిలోనూ అలుగు 

కాళేశ్వరం నీటితో వేసవి కాలంలోనూ చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయని, రైతులు రెండు పంటలు పండిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం రావురూకులలో వెంకటేశ్వరాలయం నిర్మాణానికి భూమిపూజ, పెరిక సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సుడా ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరిగౌడ్‌, సర్పంచి కవిత, వైస్‌ ఎంపీపీ యాదగిరి, ఉప సర్పంచి శ్రీకాంత్‌రెడ్డి, ఆత్మకమిటీ ఛైర్మన్‌ ప్రభాకర్‌వర్మ ఉన్నారు. 

  • సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడకలో రూ.10కోట్లతో నిర్మించిన మహాత్మజ్యోతి బాఫులే బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు.  
  • నంగునూరు మండల పరిధి ముండ్రాయిలో డీసీసీబీ బ్యాంకును సర్పంచి కమలాకర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌తో కలిసి ప్రారంభించారు.
  • వడ్డెర సామాజికవర్గానికి వేడుక మందిరం నిర్మాణానికి రూ.2.5 కోట్ల విలువైన 14గుంటల స్థలాన్ని కేటాయించారు.
  • సిద్దిపేటలోని రూరల్‌ పోలీసు ఠాణా ఆవరణలో రూ.78 లక్షలతో సఖి కేంద్రం, రూ.1.18 కోట్లతో భరోసా కేంద్రం శాశ్వత భవనాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. హైదరాబాë్ పబ్లిక్‌ స్కూల్‌(బేగంపేట) ఏడో తరగతి చదివే విద్యార్థిని ఆకర్షణ 752 పుస్తకాలతో భరోసా కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డీజీపీ అంజనీకుమార్‌, అదనపు డీజీపీ శిఖాగోయల్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోందని, ఇతర రాష్ట్రాల అధికారులు తెలంగాణలోని భరోసా కేంద్రాలను సందర్శిస్తూ సేవలు తెలుసుకోవడం అందుకు నిదర్శనమన్నారు.
  • సిద్దిపేట శివారు రంగనాయక సాగర్‌ అతిథి గృహం వద్ద చాగంటి కోటేశ్వరరావును మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించి సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ చాగంటి ప్రవచనాలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయని వెల్లడించారు. 

సమావేశానికి హాజరైన వివిధ గ్రామాల మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని