logo

నిబంధనల అమలు..అడుగడుగునా తనిఖీలు

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది.

Published : 17 Apr 2024 02:55 IST

 కారులో పరిశీలిస్తున్న పోలీసులు

న్యూస్‌టుడే, సిద్దిపేట: ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల నగారా మోగగా మే 13న తెలంగాణలో పోలింగ్‌ తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. ప్రణాళికాబద్ధంగా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో పెద్దమొత్తంలో నగదు, మద్యం, ఇతర వస్తువులు లభించాయి. తనిఖీల సందర్భంలో ఇతరత్రా నేరాలు వెలుగుచూస్తుండటం గమనార్హం. గంజాయి సరఫరా, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ఉదంతాలు బయటపడుతున్నాయి. జిల్లాలో ఎనిమిది గంజాయి కేసులు నమోదవగా.. రూ.2.65 లక్షల విలువైన 8.209 కిలోల మేర సరుకు స్వాధీనం చేసుకున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకొని 21 కేసులు నమోదు చేశారు. రూ.8.80 లక్షల విలువైన బియ్యాన్ని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించారు.

జిల్లాలో 26 పోలీసు ఠాణాల పరిధిలో 12 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇవి రోజులో 24 గంటల పాటు వాహనదారులపై నిఘా సారిస్తున్నాయి. అనుమానితులను జల్లెడ పడుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు - 11, స్టాటిస్టికల్‌ సర్వెలెన్సు - 13, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ బృందాలు - 26 కీలక భూమిక పోషిస్తున్నాయి. 1,009 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులోని 151 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయాచోట్ల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తుంటే స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే సీఐఎస్‌ఎఫ్‌ కంపెనీకి చెందిన 80 మంది జిల్లాకు రాగా త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు జిల్లాకు చేరనున్నాయి.


 ఫిర్యాదు చేయండి: అనూరాధ, పోలీసు కమిషనర్‌

ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం. అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తాం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే డయల్‌ 100 లేదా పోలీసు కంట్రోల్‌ రూం చరవాణి నంబరు 87126 67100లో సంప్రదించాలి. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి. పార్టీ ఏదైనా ప్రచారం అడ్డుకోవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే టోల్‌ ఫ్రీ నం. 1950 లేదా సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి.


ఇప్పటివరకు నగదు స్వాధీనం - రూ.66.10 లక్షలు
మద్యం జప్తు - 1,209 లీటర్లు
మద్యం కేసులు - 113
విలువ - రూ.6.19 లక్షలు
పరిష్కరించిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు - 121
బైండోవరు - 97
కేసుల్లో 101 మంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు