logo

నియోజకవర్గ ఇన్‌ఛార్జులెవరో?

Updated : 18 Apr 2024 06:11 IST

దృష్టి సారించిన భాజపా నేతలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: జిల్లాలో భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కొందరు పార్టీ మారడంతో కొత్తవారి నియామకంపై దృష్టి సారించారు. సంగారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పులిమామిడి రాజు ఇటీవల హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం విదితమే. దీంతో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల వేళ భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సదాశివపేటలో భారాస నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో భారాస నుంచి సంగారెడ్డి టికెట్‌ ఆశించారు. దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. అప్పటికే భాజపా అధిష్ఠానం సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేకు టికెట్‌ ప్రకటించింది. అనూహ్యంగా బీఫాం పులిమామిడి రాజుకు ఇవ్వడంతో అప్పట్లో రాజకీయ దూమారం రేపింది. ఈ వ్యవహారంపై మనస్తాపం చెందిన రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే భాజపాను తీవ్రంగా విమర్శించి భారాసలో చేరారు. రాజు గత శాసన సభ ఎన్నికల్లో 20,921 ఓట్లు సాధించారు. ఆయనకే సంగారెడ్డి అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. భాజపా చేపట్టిన పలు కార్యక్రమాలల్లో కీలకంగా పని చేస్తూ వచ్చారు. లోక్‌సభ ఎన్నికల వేళ... కీలక సమయంలో పులిమామిడి రాజు పార్టీని వీడటాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వరుసగా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పార్టీలు మారడంతో మళ్లీ ఎవరికి ఆ పదవి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

మిగతా చోట్ల.. అందోలు నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి బాబూమోహన్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం భాజపాకు రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. జహీరాబాద్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామచందర్‌రావు ఇటీవల భాజపాకు రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భాజపా సమర్థులను నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా నియమిస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని