logo

ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా

ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం

Updated : 18 Apr 2024 02:43 IST

వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు
న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ: ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం. ఇందుకు ఎన్నికల సంఘం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎంసీసీ, వీడియో సర్వే లెన్స్‌, స్టాటిస్టిక్‌ సర్వేలెన్స్‌, వీడియో ఫ్యూయింగ్‌, మీడియా కోఆర్డినేషన్‌ మానిటరింగ్‌, అకౌంటింగ్‌ బృందాలను ఎన్నికల సంఘం నియమించింది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నిబంధనలు విస్మరించి తరలిస్తున్న నగదును ఈ తనిఖీ బృందాలు పట్టుకున్నాయి. అభ్యర్థులు, వారి అనుచరులపై ప్రత్యేక నిఘాసారించాయి. ప్రచారం తీరు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారా.. ఇలా కోణాలపై దృష్టి సారించడం గమనార్హం.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌.. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని 15 నియోజకవర్గాలకు ఒక్కో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్యశాఖ అధికారి, ఒక పోలీస్‌ అధికారి, వీడియో గ్రాఫర్‌ ఉంటారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారా, ప్రలోభాలకు గురి చేస్తున్నారా అని పర్యవేక్షిస్తారు. వీటికి సంబంధించి వీడియో తీసి రిటర్నింగ్‌ అధికారులకు నివేదిస్తారు.

 వీడియో సర్వేలెెన్స్‌.. ప్రతి నియోజకవర్గానికి రెండు వీడియో సర్వేలెన్స్‌ బృందాలను నియమించారు. రెవెన్యూ పోలీస్‌ అధికారులతో పాటు వీడియోగ్రాఫర్‌ ఉన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలపై దృష్టిసారిస్తున్నారు. ప్రతి అంశాన్ని క్లుప్తంగా చిత్రీకరిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు.

 వీడియో ఫ్యూయింగ్‌.. వీడియో సర్వేలెన్స్‌ బృందాలు తీసిన వీడియోలను నిశితంగా పరిశీలించడమే వీడియో ఫ్యూయింగ్‌ సభ్యుల ప్రధాన విధి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున పని చేస్తోంది. ఇందులో ఒక గెజిటెడ్‌ అధికారితో పాటు ఇద్దరు సహాయకులు ఉన్నారు. ఉల్లంఘనలు గుర్తించి రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్తారు.
మీడియా కోఆర్డినేషన్‌ మానిటరింగ్‌.. మీడియా కోఆర్డినేషన్‌ మానిటరింగ్‌ బృందం రోజువారీగా దినపత్రికల్లో వచ్చే ప్రకటనలు, పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులను పక్కాగా లెక్క కడుతుంది. ఈ వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేసి నిత్యం రిటర్నింగ్‌ అధికారికి నివేదిస్తుంది.
అకౌంటింగ్‌.. నియోజకవర్గానికి ఒక అకౌంటింగ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ట్రెజరీ లేదా బ్యాంక్‌ అధికారి బృంద సభ్యుడిగా ఉన్నారు. ఇతర శాఖకు చెందిన ఒకరు సహాయ అధికారిగా పని చేస్తారు. అభ్యర్థుల ఖర్చులను లెక్క కడుతుంది. రోజువారి లెక్కలను రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తారు.
ఎంసీసీ.. ప్రతి మండలానికి ఒక మోడల్‌ కండక్ట్‌ బృందాన్ని(ఎంసీసీ) నియమించారు. మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఇవి పని చేస్తున్నాయి గెజిటెడ్‌ అధికారి నేతృత్వంలో పోలీస్‌ అధికారి, వీడియో గ్రాఫర్‌ పని చేస్తారు. అభ్యర్థుల ప్రచారాలు, ఖర్చులపై నిఘా సారించారు. అన్ని వివరాలను రిటర్నింగ్‌ అధికారికి తెలియజేస్తున్నారు.
స్టాటిస్టిక్‌ సర్వేలెన్స్‌.. డిప్యూటీ తహసీల్దారు ఆధ్వర్యంలో ఈ బృందం అక్రమాలపై ప్రత్యేక దృష్టిసారిస్తుంది. ఇందులో 8 మంది ఉంటారు. నలుగురు పోలీస్‌, ఓ అటవీ శాఖ, ఆబ్కారీ శాఖ అధికారులతో పాటు వీడియోగ్రాఫర్‌ ఉంటారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు స్టాటిస్టిక్‌ సర్వేలెన్సు బృందాల చొప్పున కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని