logo

ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో

ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.

Updated : 20 Apr 2024 05:52 IST

అమెరికాలో బతుకమ్మ సంబరాల్లో జిల్లా వాసులు(పాతచిత్రం)

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం. ప్రవాసులు ఇక్కడ ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఓటింగ్‌లో పాల్గొని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీలుంటుంది. ప్రజాస్వామ్య పటిష్ఠంలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కొంతమంది మాత్రమే వినియోగించుకున్నారు.

దరఖాస్తుకు అవకాశం ఉన్నా..

 జిల్లాలో ప్రవాసుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఓటరు జాబితాలో నమోదవుతున్న వారు మాత్రం వందల్లోనే. వీరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు నమోదు చేసుకున్నవారే. విదేశాల్లో ఉంటున్నవారిలో ఎవరూ నమోదుకు ముందుకు రావడం లేదు. ఆన్‌లైన్‌లో ఫారం 6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా సరిపోతుంది. అధికారులు పరిశీలించి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తారు. జిల్లా నుంచి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఎక్కువగా వెళుతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ అక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు. జిల్లాలో కుటుంబీకులు, బంధువుల ఇళ్ల వద్ద శుభ కార్యాలు, పండగలు, సెలవుల సమయాల్లో ఇక్కడికి వస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న వారి సంఖ్య 3వేలకు పైగా ఉండగా ఓటరు జాబితాలో మాత్రం 103 మందే ఉన్నారు. ఇందులో పటాన్‌చెరు నియోజవర్గానికి చెందిన వారు అత్యధికంగా 78 మంది ఉండగా నారాయణఖేడ్‌కు చెందిన వారు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.

 కారణాలు అనేకం..

ప్రవాసులు ఓటు వేయాలంటే స్వదేశానికి రావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఓటు వేసే అవకాశం వీరికి కల్పించకపోవడమే దీనికి కారణం. పనిచేస్తున్న చోట అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చి ఓటు వేయాలంటే  వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేందుకు రానుపోను ఖర్చులు రూ.వేలల్లోనే ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఓటరుగా నమోదుకు, ఓటు వేసేందుకు ముందుకురాని పరిస్థితి. ఇక్కడి రాజకీయాలపై మాత్రం వారికి ఆసక్తి తగ్గడం లేదు. ఎన్నికల్లో తమ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇక్కడ ఉన్న తమవారితో మాట్లాడుతూ ఆరా తీస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని