logo

అల్లంతదూరంలో.. ఆశలు గల్లంతు

ఐటీ రంగంలో అనిశ్చితి కారణంగా..ఆయా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు ఏడు  వేల మందికి పైగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం.

Updated : 26 Jan 2023 10:36 IST

కోదాడ, న్యూస్‌టుడే: ఐటీ రంగంలో అనిశ్చితి కారణంగా..ఆయా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు ఏడు  వేల మందికి పైగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. కోదాడ నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఉన్న ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం చేసేవారు. డిసెంబరు మొదటి వారంలో సదరు సంస్థ ఆ ఉద్యోగిని తొలగించడంతో అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం మరో 60 రోజుల్లో ఉద్యోగం చూసుకోకపోతే స్వదేశానికి పయనమవ్వాల్సిందే. ఇప్పటికే 55 రోజులైందని, మరో అయిదు రోజుల లోపు ఉద్యోగం దొరక్కపోతే భారత్‌కు రావాల్సిందేనని సదరు ఉద్యోగి వాపోయారు. జిల్లాకు చెందిన మరో ఉద్యోగి కాలిఫోర్నియాలో నాలుగేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వారం రోజుల క్రితం సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఫిబ్రవరి నెలతో ముగుస్తుంది. మరో రెండు నెలల్లో వేరే ఉద్యోగం దొరక్కపోతే స్వదేశానికి రావాల్సిందే. ఈ ఏడాది చివరిలో అతడి వివాహం ఉంది. ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడంతో సదరు ఉద్యోగి అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం హెచ్‌-1 వీసాల మీద ఉద్యోగం చేస్తున్నవారికి ఉద్యోగం పోతే మరో ఉద్యోగం 60 రోజుల్లో వెతుక్కోవాలి. హెచ్‌-1 వీసా నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగికి అక్కడ ఉండే అవకాశం లేదు. ప్రతి సంస్థలో ఉద్యోగులను తొలగించడంతో ఈ రెండు నెలల్లో మరో ఉద్యోగం దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ స్వదేశానికి వచ్చి మళ్లీ వెళ్లాలంటే అమెరికా వీసా రావాలంటే మరో ఏడాది పైగా వేచి ఉండాల్సిందే. కెనడా, లండన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం ఇప్పుడు ఇదే పరిస్థితి ఉందని ఓ ఎన్నారై తెలిపారు. 2001, 2008 సంవత్సరాల్లోనూ ఇలాగే ఉద్యోగాలు కోల్పోయారు. అప్పుడు భారతీయులు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని, అక్కడే ఉంటే ఖర్చులు భరించలేమని ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కన్సల్టెన్సీ ఉద్యోగులకు కొంత ఉపశమనం..

విదేశాల్లో కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగం చేసే వారికి ఈ ఆపద సమయంలో కొంతఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆయా కన్సల్టెన్సీలు తమ పలుకుబడితో చిన్న సంస్థలోనైనా ఉద్యోగాలు చూపించే అవకాశం ఉంటుందని ఎన్నారైలు తెలిపారు.


గత ఇరవై ఏళ్లలో ఇది నాలుగోసారి

ఎన్నారై జలగం సుధీర్‌, కోదాడ

విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోవడం కొత్తేమీ కాదు. 20 ఏళ్లలో ఇది నాలుగోసారి. 2001లో నా ఉద్యోగం పోయింది. తర్వాత స్వదేశానికి వచ్చి, ఇక్కడే కొంత కాలం ఉద్యోగం చేశాను. పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ అమెరికా వెళ్లాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని