logo

ఆకలేస్తోంది.. కావాలి అల్పాహారం

పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలనే లక్ష్యంతో విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందుకు అనుగుణంగా నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్లిప్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.

Published : 27 Jan 2023 06:01 IST

సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలనే లక్ష్యంతో విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందుకు అనుగుణంగా నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్లిప్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొనసాగుతున్నాయి. వేకువజామునే లేవడం, పాఠశాలలకు సిద్ధం కావడం.. సమయానికి చేరుకునే హడావుడిలో చాలా మంది విద్యార్థులు ఇంటి వద్ద ఏమీ తినకుండానే బయల్దేరుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్న భోజనం ఉంటుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులు జరుగుతుండటంతో ఇంటికి వెళ్లేసరికి 6.30 గంటలు దాటుతోంది. ఇలా పొద్దంతా కేవలం మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం బడుల్లో అల్పాహారం పంపిణీ లేకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఫలితంగా చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారు. జిల్లాలో 189 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల నుంచి 7,535 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి జనవరి నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్‌ బాక్సుల్లో అల్పాహారం తెచ్చుకొని ఉదయం ప్రార్థన తరువాత భుజిస్తున్నారు. ఇంటి నుంచి ఏమీ తెచ్చుకోలేని  విద్యార్థులకు అల్పాహారం అందించడానికి విద్యాశాఖ అధికారులతోపాటు వివిధ సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.


దాతలు చేయూతనిస్తే ఉపయుక్తం
- పి.రిషిత, జడ్పీ(బాలుర) ఉన్నత పాఠశాల, సూర్యాపేట

ప్రత్యేక తరగతుల నేపథ్యంలో రోజూ ఉదయం 8.15 గంటల లోపు ఏమి తినకుండా బడికి వసున్నా. మధ్యాహ్న భోజనం పెట్టే వరకు ఖాళీ కడుపుతో ఉంటున్నా. దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.


చదువుపై దృష్టి సారించలేక పోతున్నా..
- పి.స్రవంతి, జడ్పీ ఉన్నత పాఠశాల, సూర్యాపేట

గతంలో కొంతమంది వ్యాపారులు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే వారు. ఈసారి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఖాళీ కడుపుతో బడికి హాజరవుతున్నా. మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం 6 వరకు ఎలాంటి స్నాక్స్‌ అందించకపోవడంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని