logo

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు షురూ..

చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గృహాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Published : 29 Jan 2023 04:34 IST

నేడు వేకువజామున పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం

గర్భగుడిలో పశ్చిమ ముఖంగా దర్శనమిస్తున్న శివలింగం

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గృహాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం వేకువజామున 4 గంటలకు స్వామివారి కల్యాణం, మంగళవారం వేకువజామున 4 గంటలకు అగ్నిగుండాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుమారు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు హాజరై స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జైబోలో తెలంగాణ సినిమా దర్శకుడు ఎన్‌.శంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై శనివారం వేడుకలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పి.రామలింగేశ్వరశర్మ, ఈవో నవీన్‌కుమార్‌ పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షతావధానిశాస్త్రి, నీలకంఠశావాచార్య ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణ, గణపతిపూజలు నిర్వహించారు. జ్వోతి వెలిగించి, కంకణధారణ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ మురళీమోహన్‌, సర్పంచి మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు మేకల రాజిరెడ్డి, నాయకులు ఊశయ్య, కృష్ణ, చంద్రశేఖర్‌, అర్చకులు నాగరాజు శర్మ, సురేశ్‌ శర్మ, సతీశ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

గణపతి పూజలో  పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి,
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, తదితరులు

భక్తులకు విస్తృత ఏర్పాట్లు: మంత్రి

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని పేర్కొన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ సహ ఇతర అన్ని శాఖల అధికారులు, సిబ్బంది గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 

ఆలయ ప్రత్యేకతే వేరు..

శివరాత్రి వచ్చిందంటే శివాలయాల్లో హరహర మహాదేవా...శంభోశంకర నాదం మార్మోగుతోంది. కానీ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మాఘశుద్ధ సప్తమి (రథసప్తమి).. మొదలుకొని ద్వాదశి వరకు చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గృహాలయంలో విద్యుత్‌ దీపాల వెలుగు, భక్తుల శివనామ స్మరణతో మార్మోగుతోంది. ఈ మాసంలో క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించే జాతరకు అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవానికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనాతో లడ్డూలు, పులిహోర ప్రసాదం అందుబాటులో ఉంచారు.  ఇక్కడ స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించే మండపం వద్ద ఇరువైపులా పనులు జరుగుతున్నందున ఆ ప్రాంతం కింది భాగంలో స్వామి వారి కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.

12 నెలలూ జాతరే

ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి నెలా అమావాస్య రోజున రాత్రి సుమారు 70వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. దీంతో ఆ రోజున స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన చేపడతారు. ఇలా 12 నెలల పాటు భక్తులు రావడంతో ఈ దేవాలయంలో 12 జాతరలు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు