logo

ఇంతింతై అల్లుకునేలా..!

తెలంగాణ ప్రాంతంలో మగ్గం వర్క్‌ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పురుషులు వస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు రూపొందిస్తూ బొటిక్‌లలో వందలాది మంది ఇతర రాష్ట్రాల వారు ఉపాధి పొందుతున్నారు.

Published : 01 Feb 2023 05:33 IST

మహిళల స్వయం ఉపాధికి ఉచిత కుట్టుశిక్షణ

కేంద్ర ప్రభుత్వ పథకం కింద కుట్టుమిషన్‌ శిక్షణ పొందుతున్న మహిళలు (పాత చిత్రం)

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రాంతంలో మగ్గం వర్క్‌ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పురుషులు వస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు రూపొందిస్తూ బొటిక్‌లలో వందలాది మంది ఇతర రాష్ట్రాల వారు ఉపాధి పొందుతున్నారు. దీనికి భిన్నంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల నిరుపేద మహిళలకు కుట్టుమిషన్‌ అత్యాధునిక ఎంబ్రాయిడరీ డిజైన్లలో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా చూడాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల పాలిట వరంగా మారనుంది. ప్రతి నియోజకవర్గంలో మొదటి దశలో మూడువేల మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 36 వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.

* ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏడాదిలో కొంత కాలం మాత్రమే శిక్షణ ఇచ్చేవి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సామాజిక సేవ సంస్థల వారికి ఈ శిక్షణల బాధ్యతలు అప్పగించి జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించే వారు. కొవిడ్‌ కారణంగా ఈ శిక్షణలు తగ్గుముఖం పట్టగా.. శిక్షణలకు ప్రభుత్వ నిధుల కేటాయింపులు సైతం నిలిచి పోయాయి.

* కొవిడ్‌ అనంతరం పరిస్థితులు అనుకూలించటంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి సహకారంతో శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

కటింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలు

* 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలను ఎంపిక చేసి శిక్షణలు ఇచ్చి ప్రతినెల సగటున రూ.17వేల వరకు ఒక్కొక్కరిపై ఖర్చుచేసి వారికి అధునాతన కుట్టుమిషన్లు సైతం అందజేయాలని నిర్ణయించారు. శిక్షణ పొందిన వారికి స్థానికంగా ప్రభుత్వ పాఠశాలల్లో సారూప్య దుస్తులు కుట్టే బాధ్యతలు అప్పగించటంతో పాటుగా గురుకులాలు, వసతిగృహాల విద్యార్థుల దుస్తులు కుట్టించనున్నారు.

* చురుకైన ప్రతిభ కనబరిచే వారికి డిజైనింగ్‌లో శిక్షణతో ఫ్యాషన్‌ దుస్తులు కుట్టేలా అవకాశాలు కల్పించనున్నారు. సొంతంగా డిజైనర్‌ దుస్తులు కుడితే వాటిని మార్కెటింగ్‌ చేసుకునేలా విక్రయశాలలు సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రభుత్వ ఆదేశాల మేరకు..
- కాళిందిని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, నల్గొండ

శిక్షణ విషయమై ప్రభుత్వం నుంచి గైడులైన్స్‌ రావాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ అనుమతితో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తాం. మహిళలకు ఉచిత కుట్టుమిషన్‌ శిక్షణ ఎంతో ఉపయోగ పడటంతో పాటుగా వారు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని