logo

పాతగుట్టలో కల్యాణోత్సవం

మండప శుద్ధి.. విష్వక్సేన ఆరాధన.. అగ్నిపూజ వంటి సంప్రదాయ పర్వాలతో పాతగుట్ట దేవాలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం కొనసాగింది.

Published : 04 Feb 2023 05:22 IST

పాత గుట్టలో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: మండప శుద్ధి.. విష్వక్సేన ఆరాధన.. అగ్నిపూజ వంటి సంప్రదాయ పర్వాలతో పాతగుట్ట దేవాలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం కొనసాగింది. శుక్రవారం రాత్రివేళ పాంచరాత్రాగమ విధానాలతో బ్రహ్మోత్సవ విశిష్ట కైంకర్యాన్ని ఆలయ పూజారులు చేపట్టారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు చేశారు. పట్టువస్త్రాలతో అలంకృతులైన నరసింహుడు గజ వాహనంపై ముత్యాల పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి మంగళవాయిద్యాలు, మంత్ర పఠనాల మధ్య ప్రజాప్రతినిధులు, యాదాద్రి ఆలయ నిర్వాహకులు తోడురాగా కల్యాణ మండపానికి చేరారు. స్వామి, అమ్మవారి సేవలను వేదికపైకి చేర్చి పూజారులు తిరుకల్యాణ తతంగాలను చేపట్టారు. జంధ్యధారణ, పాద ప్రక్షాళన, జీలకర్ర, బెల్లం జరిపాక మాంగళ్యధారణ పర్వాన్ని నిర్వహించారు. తలంబ్రాల ధారణ చేశాక, భక్తులకు ఆశీస్సులను అందజేశారు. ముందుగా ముఖ్యులకు సంకల్పంతో రక్షాబంధనం చేశారు.

ఉదయాన.. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం యాగశాలలో హవనం, ప్రబంధ పారాయణం చేపట్టారు. కల్యాణ ఘడియలు రాబోతున్న వేళకు ముందస్తుగా శ్రీ నరసింహుడిని రామచంద్రుడి రూపంలో అలంకరించి హనుమంతుడిపై అధిష్టింపజేసి తిరువీధుల్లో భక్తుల సందర్శనార్థం ఊరేగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని