logo

బంధం ఎందుకో.. బలహీన పడుతోంది

వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు.

Published : 28 Mar 2024 05:09 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా జరుగుతున్న హత్యల్లో వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తలను హత్య చేయిస్తున్న వారి సంఖ్య 25 నుంచి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తను హత్య చేసిన వారు జైలు జీవితం గడిపి తిరిగి సుఖంగా ఉన్న దాఖలాలు ఒక్కటి కూడా లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాదిలో వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నాడని భర్తలను చంపిన భార్యల సంఖ్య 67 ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. లెక్కల్లోకి రానివారి సంఖ్య మరికొంత ఉంటుంది.

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తని చంపిన భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు (పాత చిత్రం)


ఘటనలు ఇలా..

కట్టంగూరు మండలం కలిమెర గ్రామానికి చెందిన ఓ వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండేది. కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. చివరకు కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయడానికి పూనుకుంది. దీనికి మంగళసూత్రాన్నే సుపారీగా కుదుర్చుకుంది. వారం రోజుల క్రితం నలుగురు కలిసి హత్యచేశారు. కటకటాల పాలయ్యారు. వారి ఇద్దరి పిల్లల భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి వెళ్లింది.

ఆరు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న యువకుడు తన సమీప బంధువును ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొంత కాలం సఖ్యతగా ఉన్నవారికి ఒక పాప, బాబు పుట్టారు. ఆర్ధికంగా భాగా స్థిరపడిన అతను వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో అతడి భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఒక రోజు భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి సుత్తితో కొట్టి భర్తను చంపేశారు.  పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఇద్దరిని జైలుకు పంపారు. ఇద్దరు పిల్లలు మాత్రం అనాథలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.


భయమే హత్యల వరకు దారి తీస్తుంది
- డా.శివరామకృష్ణ, మానసిక వైద్యుడు, నల్గొండ

ఒకరికి మించి ఎక్కువ మందితో శారీరక సంబంధం కొనసాగించడం ఎంత మాత్రం సరైంది కాదు. కొంత కాలం క్రితం వరకు పురుషులు మాత్రమే ఒకరికి మించి ఎక్కువ వివాహాలు చేసుకునేవారు. ఇప్పుడు అలాంటి వివాహాలు తగ్గి సాధ్యం కాని కోరికల వైపు వెళ్తున్నారు. విషయం బయట పడడంతో భయంతో హత్యల వరకు వెళ్తూ ఇరువురి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పక్కదారి పట్టాలనే ఆలోచన వచ్చినవారు ఇంతకు ముందు ఇతరులకు జరిగిన ఘటనలు గుర్తు చేసుకుని తన జీవితం అలా కాకూడదనే ఆలోచనతో బయటకు రావాలి. భర్త, పిల్లలు కుటుంబం అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ మంచి లక్ష్యాల కోసం పోటీ పడుతుండాలి. నిత్యం యోగా, ధ్యానం, చేయడంతో పాటు మానసిక వైద్యులను సంప్రదించినట్లయితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని