logo

ఆట కట్టించలేరా..?

జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’...

Published : 28 Mar 2024 05:16 IST

తోటల్లో రహస్యంగా జూదం

పెన్‌పహాడ్‌ మండలం దూపహాడ్‌లోని ఓ మామిడి తోటలో జూదం ఆడుతున్న జూదరులు

సూర్యాపేట నేరవిభాగం, పెన్‌పహాడ్‌, న్యూస్‌టుడే: జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’ కథనంతో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోని సరిహద్దు గ్రామాల్లో తోటలపై అక్కడి పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. దీంతో జూదం నిర్వాహకులు ఆట స్థావరాలను తాజాగా సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్‌పహాడ్‌ మండలానికి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం జూదాన్ని నిషేధించినా.. ఏదో ఒకచోట స్థావరాలను ఏర్పాటు చేసుకొని రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోలీసులు ఒకవైపు రాష్ట్ర సరిహద్దులతో పాటు జాతీయ రహదారులపై చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు కొందరు జూదరులు మాత్రం జిల్లా కేంద్రానికి సమీపంలోనే తోటల్లో రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు.

ఆన్‌లైన్లో డబ్బులు.. టోకెన్ల ద్వారా లావాదేవీలు..

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా డబ్బు రవాణా సాధ్యం కాకపోవడంతో ఆన్‌లైన్లో చెల్లించి.. టోకెన్లు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో టోకెన్‌ విలువ కనీసం రూ.5 వేల నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ టోకెన్ల సాయంతోనే వారు లావాదేవీలు పూర్తి చేస్తారు. గెలుపొందిన వారు టోకెన్లను తిరిగి చెల్లించి డబ్బులను ఆన్‌లైన్లోనే తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. పది రోజులుగా పెన్‌పహాడ్‌ మండల కేంద్రంతో పాటు దూపహాడ్‌ గ్రామ పరిధిలోని కొన్ని తోటల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ తంతు కొనసాగుతోందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల నుంచి రోజుకు సుమారు యాభై మంది జూదరులు(పంటర్లు) ఇక్కడికి క్షేమంగా చేరుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. సొంతంగా కాకుండా నిర్వాహకుల వాహనాల్లోనే అక్కడికి తరలిస్తున్నారు. రోజుకు రూ.కోట్లల్లో డబ్బు చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డేను వివరణ కోరగా.. ‘పరిశీలించి గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. సిబ్బందిని పంపి నిర్వాహకులను పట్టుకుంటామని’ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని