logo

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Published : 28 Mar 2024 05:24 IST

నల్గొండలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలుపై బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రైతుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని.. దళారీల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. బయటి రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలు ఉంటే తహసీల్దార్‌, ఆర్‌డీవో దృష్టికి తీసుకురావాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2203, సాధారణ రకానికి రూ.2183 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. మద్దతు ధరల పట్టికలు కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజాప్రతినిధులు ప్రారంభించొద్దు.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులెవరూ ప్రారంభించకూడదని అదనపు కలెక్టర్‌ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి రాజకీయపరమైన ఫ్లెక్సీలు ఉండకూడదని తెలిపారు. ఈ విషయంలో నిర్వహకులు జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద క్రిమినల్‌ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఎస్‌ఎం మేనేజర్‌ నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ నాగిరెడ్డి, డీసీవో కరుణాకర్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌, తూనికల కొలతల అధికారి రామకృష్ణ, మార్కెటింగ్‌ అధికారి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని