logo

కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!

ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా..

Published : 28 Mar 2024 05:26 IST

రాయితీపై ఇచ్చే కోడి పిల్లలు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ప్రయోజనం ఉండటం లేదు. నాటు కోడి ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. డిమాండ్‌ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత వాసులకు రాయితీ కింద పెరటి కోళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 75 శాతం రాయితీ కింద నెల వయస్సున్న కోడి పిల్లలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పంపిణీకి కసరత్తు చేసింది. ఇంటి వద్దనే ఉండి అదనపు ఆదాయం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

రెండు రకాల యూనిట్లు..

రాయితీ కోడి పిల్లల పంపిణీలో రెండు రకాల యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌ కింద 45 కోడి పిల్లలను 75 శాతం రాయితీ కింద పంపిణీ చేశారు. దీని మొత్తం విలువ రూ.3330 ఉండగా.. రాయితీ కింద రూ.1080 డీడీ కడితే చాలు. ఇక రెండో రకం యూనిట్‌ 25 కోడి పిల్లలది. దీని మొత్తం విలువ రూ.1240 ఉండగా..రూ. 600 డీడీ చెల్లించాలి. మొదటి విడత కింద 45 యూనిట్లను పంపిణీ చేశారు. కానీ.. 25 పిల్లల యూనిట్లను ఇప్పటికి పంపిణీ చేయకపోవడంతో డీడీలు కట్టిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. యూనిట్లయినా మంజూరు చేయండి.. లేదంటే డీడీలు తిరిగి ఇవ్వమని సంబంధిత కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారులు స్పందించి త్వరలో పంపిణీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. కోడి పిల్లల పథకానికి టెండర్లు ఖరారు కాలేదని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి యాదగిరి చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పంపిణీ చేస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని